కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూగా ఇప్పటికే విపరీతమైన ప్రచారం పొందుతున్న అమిత్ షాకు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అత్యంత కీలకమైన హోంమంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. సాధారణంగా హోంశాఖ నిర్వహించేవారే కేంద్రంలో ప్రధానమంత్రి తర్వాతి స్థానంలో ఉంటారు. ఇలా.. శాఖల పరంగానూ.. అమిత్ షాకు నరేంద్రమోడీ అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆయనకు సహాయమంత్రిగా… తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి చాన్సిచ్చారు. కేబినెట్ దక్కుతుందని అనుకున్న కిషన్ రెడ్డికి సహాయమంత్రి పదవి మాత్రమే లభించింది. అది కూడా.. కీలకమైన హోంశాఖ.. లభించడంతో… కాస్త ప్రాధాన్యత దక్కిందనే భావన.. వ్యక్తమవుతోంది.ఇక గత ప్రభుత్వంలో… హోంశాఖను చూసిన రాజ్‌నాథ్ సింగ్ కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇది కీలకమైన శాఖగా ఉన్నప్పటికీ…పెద్దగా పని ఉండదనే చెప్పుకోవాలి.
ఇక ఆంధ్రాకోడలు… నిర్మలాసీతామన్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. ఎన్డీఏ మొదటి సర్కారులో మొదటగా సహాయమంత్రి పదవి ఇచ్చిన మోదీ.. ఆ తర్వాత
విస్తరణలో ఆమెకు.. రక్షణ శాఖ మంత్రిగా కేబినెట్ హోదాను కల్పించారు. ఇప్పుడు.. నేరుగా.. కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ బాధ్యతను అరుణ్ జైట్లీ చూశారు. ఆయన అనారోగ్యంతో.. పదవి చేపట్టడానికి నిరాసక్తత వ్యక్తం చేయడంతో… కొత్త వారికి బాధ్యతలివ్వాలని మోడీ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా.. మొదటగా అమిత్ షా పేరు వినిపించింది. చివరికి ఆ శాఖ నిర్మలా సీతారామన్‌కు దక్కింది. రవిశంకర్ ప్రసాద్‌కు ఇంతకుముందులాగే న్యాయ శాఖ అప్పగించగా స్మృతి ఇరానీకి మహిళా శిశు సంక్షేమం శాఖను కేటాయించారు. రాహుల్ గాంధీపై గెలిచిన ఇరానీకి.. మంచి శాఖ కేటాయిస్తారని భావించారు కానీ… పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
గతంలోలాగానే పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖ,ప్రకాష్ జవదేకర్‌కు అటవీ పర్యావరణ, రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ఆహార పౌరసరఫరాలు, ధర్మేంద్రప్రదాన్ పెట్రోలియం శాఖను అప్పగించారు. కేబినెట్లో ఉన్న ఏకైక మైనార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీకి..మైనార్టీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఓ రకంగా… పాతమంత్రులందరికీ… అవే శాఖలు కేటాయించారు. కొన్ని మాత్రమే కీలకమైన మార్పులు చేశారు. ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల కోసం కానీ.. మరో కారణంతో కానీ.. మళ్లీ ఇటీవలి కాలంలో… మంత్రి వర్గ విస్తరణ జరిపే అవకాశం లేదని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.