వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వృద్ధుల పెన్షన్ ని రెండు వేల రూపాయల నుండి 2,250/- కి పెంచుతున్నట్లు గా ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన మీద మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 2000 రూపాయల నుండి పెన్షన్ ని మూడు వేల రూపాయలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చి, ఇప్పుడేమో ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో దీన్ని నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోయి మూడు వేల రూపాయలకు తీసుకువస్తాం అని జగన్ ప్రకటించడం అవ్వా తాతల నిరుత్సాహానికి కారణమైంది.
అయితే జగన్ తో పోలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే పెన్షన్ ని మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చినట్లుగా టిడిపి కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన, చంద్రబాబు కు బదులుగా జగన్ ని ఎన్నుకోవడం వల్ల ప్రతి అవ్వా ప్రతి తాతకు దాదాపు 18,000 రూపాయల నష్టం వస్తుందని టిడిపి కార్యకర్తలు వాదిస్తున్నారు. వారి వాదన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:
చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే మొదటి నాలుగేళ్లలో నెలకు మూడు వేల చొప్పున, 3000 * 48 = 1,44,000 అయ్యేదని, కానీ జగన్ మొదటి ఏడాది 2,250 రూపాయలు, రెండవ ఏడాది 2500 రూపాయలు, మూడవ ఏడాది 2750 రూపాయలు, నాలుగవ ఏడాది మూడు వేల రూపాయలు ఇవ్వడం వల్ల- 2,250*12= 27,000, 2,500*12= 30,000, 2,750*12= 33,000, 3,000*12= 36,000 చొప్పున మొత్తం 1,26,000 అవుతుంది అని, ఈ లెక్కన ప్రతి అవ్వా ప్రతి తాతకు దాదాపు 18,000 రూపాయల నష్టం వస్తుందని వారు అంటున్నారు.
అయితే, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల వాదన మరోలా ఉంది. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో లో వృద్ధాప్య పింఛను రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ” పెంచుకుంటూ పోతాం” అని రాసి ఉందని, జగన్ ముఖ్యమంత్రి కాగానే తక్షణమే 3000 కి పెంచుతామని చెప్పలేదని వారు వాదిస్తున్నారు. ఇది నిజమే అయినప్పటికీ, వైఎస్ఆర్సిపి పార్టీ పంచిన కరపత్రాలలో కానీ, వైయస్సార్ సిపి పార్టీ అధికారికంగా విడుదల చేసిన వీడియో ప్రకటనలలో గానీ, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి అవ్వా తాత కి పెన్షన్ ని మూడు వేల రూపాయలకు పెంచుతాం అని స్పష్టంగా ఉంది . ఈ క్రింద ఉన్న వీడియో ఒకసారి చూడండి:
ఏది ఏమైనా మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా పేరు ఉన్న జగన్ నుండి ఇటువంటి గారడీలు ఊహించలేదని జనం అంటున్నారు.