రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైనా సచివాలయంలో నూతన సీఎం వైఎస్ జగన్ తొలిసారి అడుగుపెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది. జూన్ 8న ఉదయం 8:39కి తన ఛాంబర్లోకి జగన్ ప్రవేశించనున్నారు. ఇప్పటికే సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. మొదటి బ్లాక్ లో సీఎం చాంబర్, ఇతర బ్లాక్ లు, జగన్ వచ్చే మార్గం వంటి అంశాలను రెండు రోజుల క్రితం వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సీఎం చాంబర్ కు కూడా వెళ్లి కలియ తిరిగారు. ప్రమాణ స్వీకారం గురువారం చేశాక… శుక్రవారం జగన్ సచివాలయానికి వస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని వాస్తు కారణాలతో జగన్ సచివాలయానికి వెళ్లలేదు. సోమవారం సచివాలయానికి వెళ్లాలంటే అదే రోజు అమావాస్య కావడంతో….మంచిరోజు చూసుకుని వెళ్లాలని పండితులు సలహా ఇచ్చారు.
జగన్ శుక్రవారం ఇంటివద్దనే ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు మాత్రమే జగన్ను కలిశారు. నూతన డీజీపీగా నియమితులైన గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ అధికారులతో జగన్ సమావేశమయ్యారు. శని, ఆది రోజుల్లో సచివాలయానికి సెలవు కావడంతో అధికారులను ఇబ్బందిపెట్టడం ఎందుకనే భావనలో జగన్ ఉన్నారు. రేపటి నుండి ఆరు శాఖలపై ఇంట్లోనే సమీక్ష చేయనున్నారు. ఏపీలో అనేక భారీ ప్రాజెక్ట్ ల పనులు, అమరావతి రాజధాని పనులు, జలవనరుల శాఖలో అనేక కీలక ప్రాజెక్ట్ లు వంటి పనులు నడుస్తున్నాయి. అదే స్థాయిలో ఎపి తీవ్ర అర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటుంది. వేల కోట్లతో చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అలాగే నవరత్నాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ఆరో తేది వరకు వరుసగా శాఖల వారిగా సమీక్షల షెడ్యూల్ను ఖరారు చేశారు. శనివారం రాష్ట్ర అర్ధిక పరిస్థితులపై సమగ్రంగా ఆర్ధిక శాఖతో చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలైన ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మైనింగ్, అటవీ, కమర్షియల్ టాక్స్ శాఖలపై సమీక్షించనున్నారు. ఆరో తేదీన సీఆర్డీఏపై సమీక్ష చేస్తారు.
రాజధాని నిర్మాణం, ఆర్థిక శాఖ, పోలవరం పురోగతి, జలవనరుల శాఖ కింద చేపట్టిన ప్రాజెక్టులు, పెండింగ్ బిల్లుల విడుదల, అంశాలపైనే సీఎం జగన్ తొలుత సమీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత నవరత్నాల అమలు, ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంపై దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి వచ్చే వారంలో.. పాలనా యంత్రాగాన్నీ గాడిలో పెట్టడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం రెండు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. అన్నీ నమ్మకల ప్రకారమే చేస్తున్నారు.