గత ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ ఆదివారం జరిగింది. తాడేపల్లిలోని సీఎం కేంపు కార్యాలయంలో జరిగిన తొలి సమావేశానికి… ఉప సంఘం సభ్యులు మంత్రులు రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ తొలి సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసింది ఏంటంటే… 30 అంశాలపై సమీక్షించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని ప్రాంతంలో భూములు, సీఆర్డీయే, సాగునీటి ప్రాజెక్టులపై ముందుగా ఉప సంఘం దృష్టి సారించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, ఆ మధ్య సంచలనమైన విశాఖ భూకుంభకోణం ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తారని సమాచారం. ఈ ఉప సంఘంలోని సభ్యులు ప్రతీ 5 రోజులకి ఓసారి సమావేశమౌతారు. ప్రతీ పదిహేను రోజులకి ఒకసారి ముఖ్యమంత్రితో భేటీ అయి, ప్రోగ్రెస్ ని వివరిస్తారు.
సీఎంతో సమావేశం అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ… అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎన్నో సంస్థలు చాన్నాళ్ల నుంచీ చెబుతున్నాయన్నారు. ఆ ఆరోపణలను నిజం అని ప్రజలు కూడా నమ్మారు కాబట్టే, గడచిన ఎన్నికల్లో టీడీపీ మీద విముఖత చూపించారన్నారు. కాబట్టి, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయనీ, కాబట్టి అన్నీ సమీక్షిస్తామనీ, కొన్ని ప్రాజెక్టులు అవసరమా లేదా అనేదీ పరిశీలిస్తామన్నారు. గత ప్రభుత్వం దేన్నీ వదిలిపెట్టలేదనీ, చివరికి పుష్కరాల్లో వాటర్ పేకెట్లు అమ్మకం, షామియానాల ఏర్పాట్లలో కూడా అవినీతి ఉందన్నారు. దోమలపై దండయాత్ర అన్నారు, ఒక్కో ఎలుకను పట్టేందుకు రూ. 6 లక్షల చొప్పున ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. ఈ ఉప సంఘం ముఖ్యోద్దేశం పాత తప్పుల్ని వెలికితీసి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడటం కోసమే అన్నారు.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనను జల్లెడపట్టే ప్రయత్నం మరింత తీవ్రతరం అయిందని చెప్పాలి. ముందుగా సాగునీటి ప్రాజెక్టులు అంటున్నారు. మరి, జగన్ సర్కారు మొదలుపెట్టిన ఈ ప్రయత్నంపై తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి స్పందనా లేదు. ఏదేమైనా, ఇది టీడీపీ నేతలకు కొంత టెన్షన్ పెంచే అంశమే అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం సంధించబోతున్న ఆరోపణలపై కౌంటర్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఐదురోజులకు ఓసారి ఉప సంఘం భేటీ అంటే… ఈ అంశానికి జగన్ సర్కారు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!