ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వికలాంగులు, ఇతర సామాజిక పెన్షన్లు.. ఈ సారి ఒకటో తేదీన అంటే.. ఈ రోజు అందడం లేదు. ఎనిమిదో తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ రోజున వైఎస్ఆర్ జయంతి కాబట్టి.. ఆ రోజున పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నాయి. అయితే.. పథకం పేరును వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మార్చినంత మాత్రాన.. వృద్ధులకు.. వారం రోజులు ఆలస్యంగా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందున్న చర్చ నడుస్తోంది.
నిధుల కటకటనా..? వైఎస్ఆర్ జయంతినా..?
వైఎస్ఆర్ జయంతి ఎనిమిదో తేదీన కాబట్టి.. ఆ రోజున పెన్షన్లు పంపిణీ చేయాలని… ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిజానికి ఇది కొత్త పథకం ఏమీ కాదు. కొత్తగా.. రూ. 250 మాత్రమే పెంచారు. అంత మాత్రానికే.. వైఎస్ఆర్ జయంతి వరకూ.. పెన్షన్ల పంపిణీని నిలిపివేయడం ఏమిటన్న చర్చ సహజంగానే వస్తోంది. అయితే.. నిధుల సమస్య కారణంగా వారం రోజులు వాయిదా వేసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. రాష్ట్రంలో 54 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. వయసును అరవై ఐదు నుంచి అరవైకి తగ్గించడంలో మరో ఆరు లక్షల మందికి అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ప్రకటన అయితే చేశారు కానీ.. లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ గురించి ఆలోచించలేదు…కాబట్టి.. ఇప్పటికి అయితే.. 54 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలి. ఇందులో కిడ్నీ బాధితులకు రూ. పదివేల చొప్పున పెంచారు. ఇవన్నీ కలుపుకుని నెలకు రూ.1200 కోట్లవుతున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం పెంచడంతో.. పెన్షన్లకు కటకట ఏర్పడిందని.. వారం రోజుల పాటు వాయిదా వేస్తే.. ఈ గ్యాప్‌లో వచ్చే నిధులతో సర్దుబాటు చేయవచ్చని.. అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
పెన్షన్‌పై ఆధారపడేవారిని జయంతి పేరుతో ఇబ్బంది పెడతారా..?
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ రోగులు.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసమే ఎదురుచూస్తూంటారు. వాటితోనే వారికి జీవనం సాగాల్సి ఉంటుంది. అలాంటిది.. ఆ సొమ్ము ఆలస్యం చేస్తే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయం తెలియని అధికారులు ఉండరు. గత ఐదేళ్లలో ప్రభుత్వం.. ఠంచన్‌గా.. నెలాఖరు రోజు నుంచే పంపిణీ ప్రారంభించేది. ఒకటో తారీఖున.. వృద్ధులందరికీ.. నగదు అందేలా చర్యలు తీసుకునేది. చివరికి నోట్ల రద్దు సమయంలోనూ.. ఇబ్బంది రానీయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి రోజు పంపిణీ చేస్తామంటూ.. ప్రభుత్వం అభాగ్యులను ఇబ్బంది పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలస్యం అయితే ఓపెనింగ్ బాగోలేనట్లే..!?
జగన్మోహన్ రెడ్డి… గత నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఆ నెల ఒకటో తేదీ జీతాలు.. పెన్షన్లు.. అన్నీ గత ప్రభుత్వం సర్దుబాటు చేసేసి వెళ్లిపోయి ఉంటుంది. జగన్ పరిపాలన ఈ నెల రోజుల్లోనే గడిచింది. జీతాలు కానీ.. పెన్షన్లు కానీ.. ఇతర సంక్షేమ పథకాలు కానీ.. ఈ నెల ఒకటో తేదీ నుంచి జగన్ ప్రభుత్వం చేసే చెల్లింపులే .. పరిగణనలోకి వస్తాయి. అదే.. మొదటిసారి… జగన్మోహన్ రెడ్డి.. వృద్ధులకు పెన్షన్లు ఆలస్యం చేస్తున్నారంటే.. కచ్చితంగా అది.. మంచి ఓపెనింగ్ కాదు. వృద్ధుల్లో తప్పుడు సంకేతాలు కూడా పంపుతాయి. ఇప్పటికే రూ. మూడువేలు పెన్షన్ ఇస్తారని ఆశపడిన వారికి..నిరాశ ఎదురయింది. ఆ ఇచ్చేది కూడా ఆలస్యం చేస్తే.. నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది.