తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదం ఎంత సంచనలమైందో తెలిసిందే. పరీక్ష పత్రాల దిద్దే క్రమంలో జరిగిన అవకతవకల వల్ల ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఆ తరువాత, కేసీఆర్ సర్కారు హుటాహుటిన స్పందించడం, రీవేల్యుయేషన్ అంటూ హడావుడి చేయడం, మళ్లీ ఫలితాలను విడుదల చేయడం, బాధ్యులపై చర్యలు అంటూ కొన్నాళ్ల తంతు… మొత్తానికి, ఇంటర్ బోర్డు వివాదం ఇప్పుడు మెల్లగా పక్కకి వెళ్లిపోయింది. అయితే, దీన్ని తిరగదోడి తెర మీదికి తెచ్చేందుకు భాజపా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. దీనిపై ఏకంగా కేంద్ర హోం శాఖ దృష్టి సారించబోతోంది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ భాజపా కోర్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో గతం కంటే 40 శాతం అధికంగా సభ్యత్వ నమోదు జరగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కూడా పెద్ద ఎత్తున జరపాలని, ఆ రోజున హోంమంత్రి అమిత్ షా సభకు వస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణపై అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ వారంలోనే హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతోపాటు, ఒక ఏడాది కాలంలో 52 మంది జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఈ చర్చల్లోనే తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదాన్ని అమిత్ షా దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. ఇంటర్ బోర్డు అవకతవకలకి కారణమైన వారిపై ఇంతవరకూ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదనీ, విద్యార్థుల మరణానికి కారణమైన అంశాన్ని మెల్లగా మరుగున పడేశారంటూ రాష్ట్ర నేతలు చెప్పారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ… ఇంటర్ బోర్డు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారిస్తుందనీ, దీనికి సంబంధించి పూర్తి నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరతామనీ, ఆ తరువాత కార్యాచరణ ఏంటనేది చూద్దామని అన్నారు.
ఓపక్క ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తూనే… మరోపక్క తెరాస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలపై కూడా భాజపా దృష్టి పెడుతోంది. ఇంటర్ బోర్డు వివాదంపై కేంద్రం దృష్టి సారిస్తే, అది మరోసారి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది. దీంతోపాటు సున్నితమైన అంశాలన్నింటి మీద భాజపా కార్యాచరణ మొదలు కాబోతోంది. కేంద్రమే తల్చుకుంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా మారిపోతుందో పక్క రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. భాజపా మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ మీద కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.