వైసీపీ ఎమ్మెల్యే రోజా కనిపించడం లేదనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. మామూలుగా అయితే.. ఆమె హడావుడి ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో ఉంటే.. వారానికి రెండు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. ఆలయం ముందే రాజకీయాలు మాట్లాడేస్తారు. అమరావతిలో ఉంటే.. వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి.. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తారు. ఇప్పుడు.. అధికార పార్టీ కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల గురించి… కథలు.. కథలు చెప్పడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అయితే.. రోజా మాత్రం.. వైసీపీ ఆఫీసులో కానీ.. అటు నగరి నియోజకవర్గంలోనూ కనిపించడం లేదంటున్నారు.
వైఎస్ చనిపోయినప్పటి నుంచి… జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్నారు రోజా. ఆమె… వైసీపీ కోసం ఫుల్ టైమ్ పని చేశారు. తొమ్మిదేళ్ల పాటు… ప్రతిపక్ష పార్టీలో ఉండి.. ఆమె చేసిన పోరాటం… చాలా మందిని ఆకర్షించింది. ఆమె మాట తీరు… బాడీ లాంగ్వేజ్ పై… విమర్శలు ఉన్నా.. రాజకీయాలకు నియమ నిబంధనలు ఉండవు కాబట్టి.. ఆ కోణంలోనే.. ఆమెను… ఫైటర్గా భావించారు. వైసీపీ గెలిస్తే.. ఆమెకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకున్నారు. కానీ.. తీరా… పదవుల పంపకం దగ్గరకు వచ్చే సరికి… మొత్తానికే తేడాకొట్టేసింది. ఆమెకు పదవి రాలేదు. దాంతో అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. జగన్ పిలిచి.. మంచి పదవి ఇస్తామని బుజ్జగించడంతో సైలెంటయ్యారని చెప్పుకున్నారు.
ఆమెకు.. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు ఇచ్చారని.. త్వరలో ఉత్తర్వులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆ ఉత్తర్వులు మాత్రం ఎప్పటికీ విడుదల కావడం లేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఈ లోపు.. కొన్ని నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయినా తన పదవి గురించి మాత్రం క్లారిటీ లేదు. దీంతో.. రోజా మనస్తాపానికి గురవుతున్నారని.. ఏదో ఓ పదవి పొందిన తర్వాతనే.. మళ్లీ మీడియా ముందుకు రావాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. వైసీపీ అధినేత.. ఎప్పుడు పదవి ఇస్తారో.. రోజా ఎప్పుడు బయటకు వస్తారోనని.. వైసీపీ నేతలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.