‘కల్కి’ సినిమా చూసినవాళ్లందరికీ ఓ సీన్ తప్పకుండా గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్ ఓ థియేటర్లో కూర్చుని సినిమా చూస్తుంటే ‘సాగర సంగమం’లోని ‘తకిట తథిమి’ అనే పాట వస్తుంటుంది. రాజశేఖర్‌ని వెదుక్కుంటూ రాహుల్ రామకృష్ణ అక్కడికి వస్తాడు.
నిజానికి ఆ సమయంలో తెరపై ‘ఖైదీ’లోని సీన్ ని ప్లే చేశారు. అక్కడ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ కూడా రాజశేఖర్‌తో కూడా చెప్పించారు. ‘ఎవడీ కుర్రాడు బాగా చేస్తున్నాడు.. తప్పకుండా ఫ్యూచర్లో స్టార్ అవుతాడు’ అనే డైలాగ్ అది. ‘కల్కి’ 1983 నేపథ్యంలో సాగే కథ. చిరంజీవి అప్పటికి స్టార్ అవ్వలేదు. కాబట్టి… ఈ డైలాగ్ సరిగ్గా సరిపోయింది.
కానీ ఆ తరవాత దాన్ని ‘సాగర సంగమం’గా మార్చి రీషూట్ చేశారు. చిరంజీవి సీన్‌ని పెట్టుంటే మంచి అప్లాజ్ వచ్చేది. కాకపోతే.. ‘చిరంజీవిని వాడుకున్నాడు’ అంటూ చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడ తనని టార్గెట్ చేస్తారో అని… ఈ సీన్‌ని మార్చి రాయించాడట రాజశేఖర్. ‘గరుడవేగ’ సమయంలో చిరుతో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరింపజేశాడు రాజశేఖర్. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ తరవాత రాజశేఖర్ వైకాపాలో చేరారు. పవన్ కల్యాణ్‌కి వ్యతిరేకంగా గాజువాకలో ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ నుంచి విమర్శలు, శాపనార్థాలూ వినిపించాయి. ‘అవసరమైనప్పుడు చిరంజీవిని వాడుకున్నావ్’ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు కూడా తెరపై చిరంజీవి సీన్‌ని చూపిస్తే.. అలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సివస్తుందనేది రాజశేఖర్ భయం. అందుకే ఖైదీ సీన్ లేపేశారు.