గడచిన ఐదు సంవత్సరాలు మనం ఎక్కడా ఏ తప్పూ చేయలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. గుంటూరు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామనీ, ఎవ్వరికీ ఇబ్బంది లేని పాలనను అందించామన్నారు. ఎన్నికలన్నాక గెలుపు ఓటములు ఉంటాయనీ, దానిపై మనం విశ్లేషణ చేసుకుందామని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ఐదుసార్లు టీడీపీ గెలిచిందనీ, నాలుగు సార్లు ఓడిపోయిందనీ, కానీ, గెలిచినప్పుడు ఎప్పుడూ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించలేదన్నారు. గెలిచినా ఓడినా అందర్నీ కలుపుకునే ముందుకు సాగామన్నారు.
కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. కార్యకర్తలపై వరుసగా దాడులు జరుగుతుండటం సరైంది కాదన్నారు చంద్రబాబు. కొన్ని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఉండటానికి వీల్లేదని దాడులు చేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఆరుగురు కార్యకర్తలు చనిపోయారనీ, ఆ కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందనీ, ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కాదని ఈ ప్రభుత్వానికి చెబుతున్నానన్నారు. ప్రజలకు చాలా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఆ పనులు చేయండి, మీకు ఆర్నెల్లు టైమ్ ఇచ్చి.. కన్ స్ట్రక్టివ్ గా పనిచేస్తే, మేం కూడా మీకు సహకరించాలని అనుకున్నామనీ, కానీ మా కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదన్నారు చంద్రబాబు. రాష్ట్రమంతా లక్షల సంఖ్యలో కార్యకర్తలున్నారనీ, అందర్నీ కాపాడుకునే బాధ్యత పార్టీది అన్నారు. దౌర్జన్యం తమకు చేతకాదనీ, ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదన్నారు. నలభై రోజుల్లో మన కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధేస్తోందన్నారు. అయితే, ఈ పార్టీని ఎవరైనా డేమేజ్ చేయాలని అనుకుంటే వారికే నష్టం తప్పదన్నారు చంద్రబాబు.
ఇకపై పార్టీ కార్యకలాపాలకే పూర్తి సమయం కేటాయిస్తాననే భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఏదేమైనా, టీడీపీ ముందు సవాళ్లు అయితే చాలానే ఉండబోతున్న వాతావరణం అధికార పార్టీ దూకుడు బట్టీ చెప్పొచ్చు. కాబట్టి, వాటిని ఎదుర్కొవాలంటే సంస్థాగతంగా పార్టీలో అన్ని శ్రేణులకీ నూతనోత్తేజం ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ముందున్న పెద్ద సవాలే ఇది అనడంలో సందేహం లేదు. ఓటమికి గల కారణాలపై నెలలకొద్దీ విశ్లేషణలు చేస్తూ కూర్చునే కంటే, పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడమే సరైందని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే ఆ టైం అధికార పార్టీ ఇవ్వడం లేదనే అనాలి.