తెలుగుదేశం పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. క్లిష్ట సమయంలో.. ఏకతాటిపై ఉండి.. పార్టీ కోసం కష్టపడాల్సింది పోయి.. ఒకరినొకరు తిట్టుకుంటూ… తమతో పాటు.. పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారు. ఓ వైపు… విజయసాయిరెడ్డి లాంటి నేతలు.. టీడీపీ నేతలపై.. ట్విట్టర్లో విమర్శల వర్షం కురిపిస్తూంటే… టీడీపీ నేతలు మాత్రం.. అంత కంటే ఎక్కువగా.. తమలో తామే… తిట్లు లంకించుకుని… నవ్వుల పాలవుతున్నారు. ముందుగా కేశినేని నాని ప్రారంభించారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న కొనసాగించారు. ఈ వివాదానికి కేశినేని నాని… నేరుగా చంద్రబాబుకు లింక్ పెట్టారు. తన లాంటి వాళ్లు పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే .. గెంటేయాలని… లేకపోతే్… “పెంపుడు కుక్క”ల్లాంటి వాళ్లను మొరగకుండా చేయాలని అదే ట్విట్టర్లో సూచించారు.
విజయసాయిరెడ్డి ట్వీట్లకు ఇటీవలి కాలంలో.. బుద్దా వెంకన్న కౌంటర్లు ఇస్తున్నారు. ఇది కేశినేని నానికి ఎందుకు నచ్చలేదో కాని.. అక్షరం ముక్క రాని వాళ్లు ట్వీట్లు చేస్తున్నారంటూ.. దౌర్భాగ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రచ్చ ప్రారంభమయింది. బుద్దా వెంకన్న కామ్‌గా ఉండలేదు. దానికి కౌంటర్ ఇచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉండకుండా.. పీఆర్పీలో చేసినట్లుగా చేయడానికి కేశినేని నాని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి కేశినేని మళ్లీ కాళ్లు పట్టుకుంటున్నారని… సెటైర్లు వేశారు. దీనికి మరింతగా రెచ్చిపోయిన… బుద్దా వెంకన్న… బాలయోగి ఆస్తులను.. కేశినేని నాని లాగేసుకున్నారని… ఆరోపణతో ట్వీట్లు చేశారు. దొంగ నెంబర్ ప్లేట్లతో.. బస్సులు నడిపారని కూడా ఆరోపించారు.
వీరిద్దరికి మద్దతుగా… వ్యతిరేకంగా.. వారికి సన్నిహితులు కూడా .. ట్విట్టర్ లో రంగంలోకి దిగారు. కేశినేని నాని… వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి నాగూల్ మీరా పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పుడా నాగుల్ మీరా.. కేశినేనికి మద్దతుగా.. బుద్దా వెంకన్నపై విమర్శలు చేస్తూ… రంగంలోకి దిగారు. ఆయన కూడా ట్వీట్లుచేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర కోసం .. కేశినేని నాని కోట్లు ఖర్చు పెట్టుకుని పార్టీని బతికించారని చెప్పుకొచ్చారు. ఇలా… ఓ ట్వీట్‌తో కేశినేని మంట అంటిస్తే.. అది టీడీపీ మొత్తానికి సెగ పుట్టిస్తోంది. ఇప్పుడు కేశినేని నేరుగా.. చంద్రబాబుకు లింక్ పెట్టి… తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నట్లుగా ట్వీట్ పెట్టడంతో.. ఆయన ఇంటెన్షన్పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.