ఆంధ్రప్రదేశ్‌లో వారంతం వస్తే చాలు.. ఉత్తరాది నుంచి భారతీయ జనతా పార్టీ నేతలు మిడతల దండుగా దిగిపోతున్నారు. హిందీలో వారు… తెలుగు ప్రజలకు అర్థం కాకపోయినా.. తెలుగుదేశం పార్టీ మీద.. తమకు రాసిచ్చిన విమర్శలన్నీ తిట్టేసి వెళ్లిపోతున్నారు. అందులో కామన్‌గా వారు చెప్పేది ఒక్కటే.. ! కుటుంబ పాలన కారణంగానే.. తాము టీడీపీని ఓడించామని.. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం. ఇంకోటి… ఏపీలో మిగిలేది.. టీడీపీ, బీజేపీలని చెప్పుకోవడం. ఈ హిందీ నేతలకు.. స్వాగతం చెప్పడానికి కనీసం.. పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా రారు. అయినప్పటికీ వారు.. తెలుగు ప్రజలపై తమ దండయాత్రను మాత్రం ఆపడం లేదు.
వారాంతాల్లో మిడతల దండులా ఏపీపైకి ఉత్తరాది నేతలు..!
భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. నోటాకు ఒకటిన్నర శాతం ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీలో పోయి .. పోయి.. ఎవరైనా చేరే సాహసం చేస్తారా..? ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఎవరైనా నమ్ముతారా..? చాన్సే లేదు. కానీ.. కేంద్రంలో ఉన్న అధికారాన్ని చూపించి.. తాయిలాలిచ్చో.. భయ పెట్టే… బతిమాలో… ఇంకొకటో చేసి.. నేతల్ని లాక్కొవచ్చు. కానీ.. ప్రజలు భయపడతారా..? తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తే… ప్రజలంతా పోలోమని.. భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లిపోతారా..?. ఉత్తరాది నేతలు.. పోలోమని.. ఏపీపైకి దండెత్తి వస్తున్నారు. వాళ్లను జైల్లో వేయిస్తాం.. వీళ్లను జైల్లో వేయిస్తాం… వాళ్లను ఖాళీ చేయిస్తామని.. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ బెదిరింపులతో ప్రజలు.. భయపడి బీజేపీ వైపు మళ్లుతారా..?
శివరాజ్ సింగ్ తన కొడుకుని రాజకీయాల్లోకి ఎందుకు తెచ్చారు..?
శివరాజ్ సింగ్ అనే పెద్ద మనిషి.. ఏపీకి వచ్చి… కుటుంబ రాజకీయాల వల్లే… టీడీపీని ఓడించామని ప్రకటించుకున్నారు. ఆ పార్టీకి వచ్చింది.. ఒక్క శాతం ఓట్లు. మరి బీజేపీ ఎలా ఓడించిందో కానీ.. సాక్షాత్తూ ఈ శివరాజ్ సింగ్ చౌహన్ తన కుమారుడ్ని.. మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నరు. కార్తీకేయ సింగ్ చౌహాన్ అనే ఈయన కుమారుడ్ని.. ప్రమోట్ చేసేందుకు మధ్యప్రదేశ్‌లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇలా.. శివరాజ్.. ఏపీ లాంటి రాష్ట్రాల్లో తిరిగి వారసత్వ రాజకీయాలను అంతం చేస్తానని ప్రసంగాలు ఇస్తూంటే.. ఆయన కుమారుడు.. ఆయన అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారు. పదిహేనేళ్ల పాటు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. కనీసం.. దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం.., ఒక్క రాష్ట్రంతో అయినా పోల్చుకోగలిగిన అభివృద్ధి సాధించలేని గొప్ప కులరాజకీయాలు చేసిన నేత ఆయన. రేపో మాపో కొడుకుని రాజకీయాల్లో ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆయన కూడా వచ్చి ఏపీలో నీతులు చెబుతున్నారు.
భయపెట్టి ఆంధ్రుల్ని లొంగ దీసుకోగలరా..?
చంద్రబాబును జైల్లో పెడతామని ఓ నేత వార్నింగ్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డికి… టీడీపీకి పట్టిన గతే పడుతుందని..మరో నేత హెచ్చరికలు చేస్తారు. ఇవన్నీ చేయడం… ఉత్తరాది అహంకారమే. తాము బిస్కెట్లు వేస్తాము.. ఆంధ్రులంతా.. తమ వెంట వచ్చేస్తారు.. వాళ్లకున్న నాయకత్వాన్ని.. కేసుల పేరుతో భయపడితే సరిపోతుందని అనుకుంటున్నారు. అందుకే.. వారాంతాలాలో విహారయాత్రకు వచ్చినట్లుగా వచ్చి.. చెలరేగిపోతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎన్ని తిట్లు పడినా.. ఎంత చేసినా.. ఆంధ్రులు తుడిచేసుకుని పోతున్నారు కదా.. అని ఉత్తరాది నేతలు మరీ అలుసుగా తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒక్క ఉత్తరాది నేతయినా విభజన హామీల గురించి మాట్లాడతారా..?
ఉత్తరాది నుంచి పేరు గొప్ప నేతలంతా వస్తున్నారు. అందరూ… ప్రజల్ని భయపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ.. ఒక్కరంటే.. ఒక్కరైనా.. ఏపీ విభజన సమస్యల గురించి కానీ.. ఏపీకి రావాల్సిన ప్రయోజనాల గురించికానీ మాట్లాడరు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు.. ఇవ్వక.. చాలా కాలం అయింది. కనీసం వాటి గురించి మాట్లాడరు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చెప్పి పదేపదే సెంటిమెంట్ దెబ్బతీస్తారు. బడ్జెట్లో ఏపీకి కేవలం కేటాయించింది.. రూ. 21 కోట్లు. ఇంత దారుణంగా.. ఏపీని వంచిస్తూ.. మళ్లీ అదే రాష్ట్రానికి వచ్చి.. ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం అంటే.. కాషాయ నేతల గడుసుదనానికి పరాకాష్ట. ఇంకా చెప్పాలంటే.. ఆంధ్ర ప్రజల్ని చాలా చీప్‌గా అంచనా వేయడమే.