దాదాపు 300 దాకా జనసేన ట్విట్టర్ అకౌంట్లు ఒకేసారి సస్పెండ్ అవ్వడం జనసేన శ్రేణు లని విస్తుపోయేలా చేసింది. అయితే దీని వెనుక వైఎస్ఆర్సిపి హస్తం ఉందని జనసేన శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
జనసేన సోషల్ మీడియా అకౌంట్ అయినటువంటి జనసేన శతఘ్ని తో పాటు, అనధికారికంగా అభిమానులు నడుపుతున్న ట్విట్టర్ అకౌంట్స్ దాదాపు మూడు వందల దాకా ఒకే రోజు సస్పెండ్ అయ్యాయి. దీనికి అధికారికంగా చెబుతున్న కారణం, ట్విట్టర్ రూల్స్ ని అతిక్రమించిన కారణంగా, ట్విట్టర్ ఈ అకౌంట్స్ సస్పెండ్ చేసింది అని. సాధారణంగా విపరీతమైన స్పామింగ్ చేసే అకౌంట్లు ట్విట్టర్ ఇలా సస్పెండ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రాజకీయ పార్టీ కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలనీ ఇలాంటి కారణాలతో మూసివేయడం చాలా అరుదు.
అయితే జనసేన అభిమానులు మాత్రం, అధికార వై ఎస్ ఆర్ సి పి పార్టీ హస్తం ఇందులో ఉందని ఆరోపిస్తున్నారు. సేవ్ నల్లమల అంటూ పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం చేసుకున్న కారణంగానే వై ఎస్ ఆర్ సి పి తన అధికార బలాన్ని, తమ ఐటీ వింగ్ నైపుణ్యాన్ని ప్రయోగించి, ఇలా ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియా అకౌంట్స్ మూయిస్తోంది అని వారంటున్నారు.
కొద్ది నెలల ముందు వరకు వైకాపా అధినేత జగన్ కూడా సోషల్ మీడియాలో తమ పార్టీ వాణి ని అణిచి వేస్తుందని చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పటికే , పలు రకాలుగా పవన్ కళ్యాణ్ వార్తల ని దాచిపెడుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా తమ వాణిని జనసేన బలంగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా జనసేన గొంతు నొక్కేయడం తో ఇక ఆ పార్టీ తమ వాణిని ఏ విధంగా వినిపిస్తుంది అన్నది వేచి చూడాలి.