ఇప్పుడా, సందర్భమే కాదుగా, ఎన్నికలూ లేవుగా… అయినా ఫెడరల్ ఫ్రెంట్ గురించి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడినట్టు..? ఎప్పటికైనా దేశానికి ఫెడరల్ ఫ్రెంటే దిక్కు అని ఇప్పుడెందుకు చెప్తున్నారు..? గడచిన పార్లమెంటు ఎన్నికలతోనే కేసీఆర్ జాతీయ రాజకీయ కలలు ఖతమ్ అనుకున్నారంతా. కానీ, ఆయన మరో నాలుగేళ్ల విజన్ తో పని మొదలుపెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విజయపరంపర గురించి గొప్పగా చెప్పారు. దేశంలో ఏ పార్టీకీ ఇలా వరుసగా విజయాలు కొనసాగడం అరుదు అన్నారు.
సి.ఎ.ఎ. గురించి మాట్లాడుతూ… తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, ఇది కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయం అన్నారు కేసీఆర్. దేశంలో అన్ని వర్గాలూ సమానమేననీ, ముస్లింలను మాత్రమే పక్కన పెడతామనే ఆలోచన సరైంది కాదన్నారు. దేశంలో ఇప్పుడు ఇదేనా పంచాయితీ, వేరే సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఓపక్క ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనీ, వృద్ధి రేటు తీవ్రంగా పడిపోతోందని నిపుణులు చెబుతుంటే కేంద్రానికి చెవికెక్కడం లేదన్నారు. ఈ దేశానికి హిందుత్వ అనే బ్రాండింగ్ వేసేందుకు ప్రయత్నించడం సరికాదనీ, దీంతో అంతర్జాతీయంగా మన దేశానికి నూకలు లేకుండా పోతాయన్నారు. తాను భయంకరమైన హిందువుననీ, పెద్దపెద్ద యాగాలు చేస్తుంటానని చెప్పారు. సీఏఏని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయనీ, అలాంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీలతో త్వరలోనే హైదరాబాద్ లో ఒక కాన్ క్లేవ్ ఏర్పాటు చేయబోతున్నా అన్నారు. భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ పిలుస్తా అన్నారు.
ఈ దేశానికి ఎప్పటికైనా ఫెడరల్ విధానమే శ్రీరామరక్ష అన్నారు కేసీఆర్. ఫెడరల్ భావజాలమున్న జాతీయ పార్టీగానీ, లేదా ఫెడరల్ ఫ్రెంట్ గానీ ఈ దేశానికి అవసరమన్నారు. తరువాత కేంద్రంలో రాబోయేది కచ్చితంగా ఫెడరల్ ఫ్రెంట్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. మోడీ సర్కారుపై దేశంలో నిరసన మొదలైందనీ, అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఒక్కోటిగా ఊడుతున్నాయనీ, దేశం వ్యక్తం చేస్తున్న నిరసనపై ఆత్మ పరిశీలన చేసుకోకపోతే దెబ్బతింటారన్నారు.
జాతీయ రాజకీయాల కలను కేసీఆర్ వదులుకున్నట్టు లేరు. ఇప్పుడీ సీఏఏని నేపథ్యంగా చేసుకుని, భావసారూప్యత గల పార్టీలూ ముఖ్యమంత్రులతో ఒక కూటమి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. కేంద్రంపై పోరాటం అంటున్నారు. సీఏఏ మీద దేశంలో ఉన్న కొంత వ్యతిరేకతను ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటుకు పునాదులుగా మార్చే విజన్ తోనే ఈ ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా భావించొచ్చు. త్వరలోనే కుమారుడు, మంత్రి కేటీఆర్ కి సంపూర్ణ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఎలాగూ ఉంది. అలాంటిదేదీ లేదని ఈరోజు కూడా కేసీఆర్ చెప్పినా, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నానని ఆయన అంటున్నా… ఓ నాలుగేళ్ల తరువాతి పరిస్థితి గురించైనా ఒక విజన్ ఉంటుంది కదా. తనయుడు రాష్ట్రంతో తాను ఢిల్లీలో ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగే ప్రయత్నం ఆరంభించారనే అనిపిస్తోంది.