శాసనసభ, శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలు.. గవర్నర్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లుగా ఉన్నాయి. ఆయన స్పీకర్ తమ్మినేని సీతారం, మండలి చైర్మన్ షరీఫ్‌లను విడివిడిగా పిలిపించారు. శనివారం సాయంత్రం.. స్పీకర్ తమ్మినేని సీతారం గవర్నర్‌ను కలిశారు. ఏం చర్చించారో బయటకు రాలేదు. మండలి చైర్మన్‌ను ఆదివారం పిలిపించారు. చర్చల వివరాలు మాత్రం బయటకు రాలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రెండు రోజుల కిందట.. గవర్నర్ ను కలిశారు. అసెంబ్లీ, శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినట్లుగా రాజ్‌భవన్ బయట మీడియాకు చెప్పారు.
ఆ ఫిర్యాదులో అందులో ఉన్న వివరాల ఆధారంగా.. గవర్నర్.. స్పీకర్ సీతారాంను వివరణ అడిగినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీలో.. టీడీపీ సభ్యులను.. సీతారాం మార్షల్స్‌తో బయటకు పంపేశారు. ఎలాంటి సస్పెన్షన్ తీర్మానాలు కానీ..కారణాలు కూడా చెప్పలేదు. తనకు ఉన్న విచక్షణాధికారంతో ఈ చర్య తీసుకున్నానని సీతారం చెబుతున్నారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని గవర్నర్ అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిన తర్వాత వైసీపీ సభ్యులు, మంత్రులు చేసిన హడావుడి.. పోడియం చుట్టుముట్టిన వ్యవహారంపై గవర్నర్‌కు.. షరీఫ్ వివరించినట్లుగా చెబుతున్నారు.
గవర్నర్‌తో భేటీ అయి వచ్చిన వెంటనే షరీఫ్.. సెలక్ట్ కమిటీ ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. మండలిలోని ఫ్లోర్ లీడర్లకు.. లేఖలు రాశారు. సెలక్ట్ కమిటీకి సభ్యుల్ని ప్రతిపాదించాలన్నారు. ప్రస్తుతం మండలి బలం ప్రకారం.. టీడీపీ నుంచి ఐదుగురు.. ఇతర పక్షాల నుంచి ఒక్కొక్కరు ఉండే అవకాశం ఉంది. మూడు రోజుల నుంచి.. బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని.. వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. వెంటనే.. షరీఫ్.. కమిటీని ఏర్పాటు చేయడానికి లేఖలు రాయడం.. హాట్ టాపిక్ అవుతోంది.