మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు తెరాసకు తిరుగులేని స్థాయిలో అత్యధిక స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే, అధికార పార్టీతోపాటూ ఇతర పార్టీలకూ సంపూర్ణ మద్దతు రాని స్థానాలు దాదాపు 23 ఉన్నాయి. వాటిని కూడా కైవసం చేసుకునేందుకు సర్వశక్తులనూ వినియోగిస్తోంది అధికార పార్టీ. ఇలాంటి చోట్ల తెరాస ముందు రెండే అవకాశాలున్నాయి. మొదటిది… ఇతర పార్టీల నుంచి గెలిచిన సభ్యుల్ని ఆకర్షించడం, అదీ జరుగుతూనే ఉంది. రెండోది… ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించి, సొంత పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటింగ్ చేయించుకోవడం. ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరంటే… పురపాలక, నగర పాలక మండళ్ల కౌన్సిలర్లతోపాటు కార్పొరేటర్లు… ఆయా ప్రాంతాలకు చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు లోక్ సభ, రాజ్యసభ ఎంపీలను కూడా మెంబర్లుగా నియమించొచ్చు. మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నిక సమయంలో ఓటు వేసే హక్కు వీళ్లకి ఉంటుంది. ఇతర పార్టీలకు కూడా ఈ అవకాశం ఉంటుంది.
అధికార పార్టీకి సరైన మెజారిటీ రాని చోట్ల హుటాహుటిన ఎక్స్ అఫిషియో సభ్యులను అధికార పార్టీ నియమించేసింది. నిజామాబాద్ లో ఎమ్.ఐ.ఎమ్.తో కలిసి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నా… ఇప్పుడా కార్పొరేషన్ చేజారకుండా ఉండేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫిషియో సభ్యులుగా రంగంలోకి దించింది. అంతేకాదు, ఒక స్వతంత్ర అభ్యర్థి, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల్ని కూడా తెరాస ఆకర్షించింది. భువనగిరి, కామారెడ్డి, ఖానాపూర్, జనగామ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భూత్పూర్, గద్వాలతోపాటు సిద్ధిపేట్ జిల్లా, మంచిర్యాల జిల్లా… ఇలా చాలాచోట్ల ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్ ఇప్పుడు అధికార పార్టీకి కీలకం కాబోతోంది. వీళ్లని ఉపయోగించుకుని… సొంత పార్టీకి చెందిన రెబెల్స్ కి కూడా తెరాస చెక్ పెడుతోంది. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్ గా నిలబెట్టిన అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరి మద్దతు కోసం తెరాస తమ దగ్గరకి వస్తుందని జూపల్లి వర్గం భావించినా… ఆయనకి చెక్ పెడుతూ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు, మజ్లిస్, స్వతంత్ర సభ్యుల మద్దతుతో అక్కడ గులాబీ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తోంది.
ఇతర పార్టీలకు కూడా ఇలా సభ్యులను నియమించుకునే అవకాశం ఉంటుంది కదా. అయితే, వాటిని కూడా తెరాస దెబ్బతీస్తోందనేది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు కాంగ్రెస్, తెరాస ఏడేసి చొప్పున గెల్చుకున్నాయి. సీపీఎం అభ్యర్థి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించారు. అంటే, ఇది కాంగ్రెస్ కి దక్కాల్సిన మున్సిపాలిటీ. మెజారిటీ మరీ తక్కువ ఉండటంతో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎంపీ కేవీపీ రామచంద్రరావుని ఉత్తమ్ నియమించారు. అయితే, తెరాస ఇక్కడ ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించింది. అంతేకాదు, చివరికి అధికారులు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కేవీపీ పేరు లేదు! దీంతో ఉత్తమ్ ఆగ్రహించి నిరసనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే కేవీపీ పేరును తప్పించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ పేరు ఎందుకు లేదంటే… ఆయన ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు సమాధానం చెప్పడం ఆశ్చర్యం. మొత్తానికి, హంగ్ ఉన్న చోట్ల కూడా అధికార పార్టీ పక్కా వ్యూహాత్మంగా వ్యవహరిస్తూ అధికారం దక్కించుకునే పనిలో నిమగ్నమై ఉంది. హంగ్ ఉన్న చోట్ల ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం చిక్కట్లేదనే చెప్పాలి.