పదో తేదీ తర్వాత అమరావతిలో పర్యటిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ మేరకు పదిహేనో తేదీన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆ రోజున రాజధాని గ్రామల్లో పర్యటించి.. రైతులకు సంఘిభావం తెలియచేయనున్నారు. గతంలో చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన వారు.. జనసేన ఆఫీసుకు వచ్చి పవన్ ను కలిశారు. నిజానికి చలో అసెంబ్లీ జరిగినప్పుడే… రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు వ్యవహారంతో… ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
అమరావతిపై కలిసి పోరాడాలని నిర్ణయించుకున్న రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో.., ఎవరూ ముందడుగు వేయలేని పరిస్థితి. ఈ పొత్తుపై ప్రజల్లో సందేహాలు ఏర్పడటం… తన అమరావతి పోరాటానికి ఆటంకంగా మారడంతో… పవన్ కల్యాణ్.. సొంతంగా.. రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన సమాచారం.. బీజేపీకి కూడా పంపలేదని తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ గురించి పెద్దగా పట్టించుకోకుండా..తమ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని నిర్ణయించుకుంది.
ఇప్పుడు అమరావతి విషయంలో… రెండు పార్టీలు వేర్వేరు దారుల్లో వెళ్తున్నట్లుగా .. రెండు పార్టీల నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. పొత్తు పేరుతో హడావుడి చేసిన రెండు పార్టీల మధ్య ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరగడం లేదు. అమరావతి పోరాటాన్ని కలిసి చేద్దామనే ఆలోచన చేయడం లేదు. బీజేపీ ఏమనుకున్నా… కలసి రాకపోయినా… తన పర్యటనను ఆపకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.