నేను లేస్తే మొత్తం దున్ని పడేస్తారు కానీ.. లేవను అన్నట్లుగా ఉంది… ఏపీ ప్రభుత్వ తీరు. గెలిచిన మరుసటి రోజు నుంచే.. ఇదిగో.. జనంలోనే ఉంటున్నానను అని ఓ తేదీ ప్రకటిస్తారు. తీరా ఆ తేదీ దగ్గరకు వచ్చేసరికి..ఎలాంటి ఉలుకూ పలుకూ ఉండదు. మొదట్లో రచ్చ బండ అన్నారు. తర్వాత ప్రజాదర్భార్ అన్నారు. నిన్నటికి నిన్న గ్రామ సందర్శన అని .. భారీగా ప్రచారం చేసుకున్నారు. ఏదీ అమల్లోకి రాలేదు. ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామాల్లోకి పోయి.. పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకుందామనుకునన సీఎం… పదో తేదీ వస్తున్నా.. దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు.. స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్తారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ .. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి..ఎనిమిది నెలలు దాటిపోయింది. తాను తన తండ్రి బాటలోనే పాలన చేస్తానని.. ప్రమాణస్వీకారం చేసిన… వారం రోజుల్లోనే.. ప్రజాదర్భార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం.. అధికారులు.. ప్రకటన చేశారు. అధికారులు చెప్పిన రోజున… పెద్ద ఎత్తున ప్రజలు సమస్యలు చెప్పుకుందామని ప్రజాదర్భార్కి వచ్చారు. కానీ ఎవర్నీ ఇంటి వద్దకు పోనీయలేదు. వాయిదా పడిందని.. చెప్పి.. ఇంటి చుట్టూ 144 సెక్షన్ విధించేశారు. ఆ తర్వాత వారానికి.. తర్వాత నెలకు.. వైఎస్ వర్థంతికి.. ఇలా.. ప్రకటనలు చేస్తూ పోయారు కానీ ప్రజాదర్భార్ ప్రారంభం కాలేదు. మధ్యలో ప్రజాదర్భార్ కోసం.. ఓ హాలు నిర్మాణానికి రూ. రెండు, మూడు కోట్లు నిధులు కూడా విడుదల చేయడం కొసమెరుపు.
ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్తూ.. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన రచ్చబండను జగన్ ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి. దానికి వైఎస్ వర్థంతిని ముహుర్తంగా పెట్టుకున్నాయి. వర్థంతి అయిపోయింది… జయంతి వచ్చినా.. దాని గురించి.. ముందడుగు పడే సూచనలు కనిపించడం లేదు. ఇలా ఎందుకనుకున్నారేమో.. జనవరి నెలాఖరులో గ్రామ సందర్శన గురించి ప్రకటించారు. అదీ పక్కన పడిపోయింది. ఎక్కడైనా… ఓ ముఖ్యమంత్రి షడ్యూల్ అంటే.. మొత్తం ఖరారు చేసుకుని బయటకు చెబుతారు. కానీ ఏపీలో మాత్రం.. ఓ ఐడియా వస్తే చెప్పేస్తారు. తర్వాత పట్టించుకోరు. ఫలితంగా.. ఈ ముఖ్యమంత్రివి అన్నీ మాటలేనన్న విమర్శలు పెరగడానికి కారణం అవుతున్నాయి.