జీతాలు రాలేదని ముష్టివాళ్లతో పేకాట ఆడి గెలిచేసి.. డబ్బు సంపాదించుకుంటాడు.. ఓ సినిమాలో పోలీసు వేషంలో ఉన్న సుత్తివేలు. ఓడిపోతాడనే డౌటే రాకూడదు. ఎందుకంటే… ఓడిపోతే ఏమవుతుందో.. సుత్తివేలుతో ఆడే ఆ ముష్టి వాళ్లకో.. పేకాట పాపారావులకో తెలియకుండా ఉండదు… ఆ తీసుకునేదేదో నేరుగా తీసుకోవచ్చు కదా..అనే డౌట్ అందరికీ వస్తుంది. అలా నేరుగా తీసుకుంటే లంచం.. ఇలా ఆట ఆడి.. గెల్చుకుంటే… మాత్రం.. సంపాదన. అందుకే.. సుత్తివేలు.. లంచం తీసుకోనని.. ప్రతిజ్ఞ చేసి.. అలా సంపాదించుకుంటారు. రెండింటికి పెద్ద తేడా ఏముందని.. బయట వాళ్లకు డౌట్ రావొచ్చు కానీ… ఆయన తీసుకున్నది లంచం మాత్రం కాదంతే. ఈ ఫార్ములా.. ఏపీ మంత్రి పేర్ని నానికి బాగా నచ్చింది. స్వయంగా ఆయన పాటిస్తున్నారో లేదో కానీ.. ఉద్యోగులకు సలహా ఇచ్చేశారు.
రెవిన్యూ ఉద్యోగ సంఘాల సమావేశానికి పేర్ని నాని హాజరయ్యారు. కొన్ని మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్పారు. ఆ క్రమంలో..ఉద్యోగులకు.. తమ ప్రభుత్వ నీతి, నిజాయితీల గురించి.. కూడా ఓ వ్యాసం అప్పచెప్పారు. తమలాగే… ఉద్యోగులు నీతి, నిజాయితీగా ఉండాలని హిత బోధ చేశారు. వైసీపీ ప్రభుత్వం అంటేనే అవినీతిరహిత ప్రభుత్వమని.. లంచాలు తీసుకున్నారని తెలిస్తే జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ఊహించలేరని వార్నింగ్ ఇచ్చారు. లంచాలను పైనుంచి నరుక్కుంటూ వద్దామని ఆవేశ పడ్డారు. ఇది మరీ ఉద్యోగులకు రుచించదని అనుకున్నారేమో కానీ.. వెంటనే వారికి ఓ బిస్కెట్ పడేశారు. ఎవరైనా.. ఏదైనా గిఫ్ట్ గా ఇస్తే తీసుకోమని ఆఫర్ ఇచ్చేశారు. దీంతో… ఉలిక్కిపడటం … ఉద్యోగుల వంతు అయింది. ఎందుకంటే… అంతంత పెద్ద పెద్ద మాటలతో అవినీతికి వ్యతిరేకంగా ప్రసంగం చేసేసి.. చివరికి లంచాలకు గిఫ్ట్‌లని పేరు పెట్టి తీసుకోమని ఓపెన్ ఆఫర్ ఇవ్వడమే దీనికి కారణం.
ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి చిన్న పనికి ప్రజల వద్ద డబ్బులు పిండుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. పని చేయకుండా సతాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… అవినీతిని అంతం చేస్తానంటూ.. జగన్మోహన్ రెడ్డి కాల్ సెంటర్ ప్రారంభించారు. వాటికి వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోతూండటంతో.. ఫోన్ చేసేవాళ్లు కూడా తగ్గిపోతున్నారు. ఇప్పుడు.. అవినీతికి తమ సపోర్ట్ ఉంటుందని… పేర్ని నాని చెప్పుకొచ్చారు. మొత్తానికి వైసీపీ సర్కార్ గిఫ్ట్‌ల రూపంలో బాగానే.. గిట్టుబాటు చేసుకుంటుందని… అందుకే..ఈ ఫార్ములాను.. ఉద్యోగులకూ… చెబుతున్నారన్న సెటైర్లు బయట నుంచి పడుతూనే ఉన్నాయి.