అధికార పార్టీ మీద విమర్శించడానికి దొరికే అవకాశాలను పక్కాగా వాడుకుంటారు ఎంపీ రేవంత్ రెడ్డి. నిజానికి, ఆయన అసెంబ్లీకి వెళ్లుంటే వేరేలా ఉండేది. అయితే, ఆ లోటు లేకుండా… జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని రేవంత్ వినియోగించుకుంటున్నారు. తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపించారు.
గత సమావేశంలో ఎమ్మార్ ఆస్తుల గురించి తాను ప్రశ్నిస్తే… ఇంతవరకూ అధికారుల నుంచి తనకు సమాధానం లేదన్నారు. కుకట్ పల్లిలో అనుమతుల్లేని కట్టడాల గురించి తాను ఫిర్యాదు చేశాననీ, దానిపై కూడా స్పందన కరువైందన్నారు. జీహెచ్ ఎంసీ మిగులు బడ్జెట్ నుంచి ఇప్పుడు లోటు బడ్జెట్లోకి వచ్చిందన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఖరే అన్నారు. ఇంటిపన్నుతోపాటు, ప్రభుత్వ బంగ్లాలకు కూడా జీహెచ్ ఎంసీకి పన్ను కట్టాలనీ, గడచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తరహా పన్ను రూ. 500 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఆదాయం రాకపోవడం వల్ల, ఈరోజు బాండ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రొఫెషనల్ టాక్స్ వాటాని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ ఎంసీకి బదిలీ చేయలేదనీ, దాదాపు రూ. 1400 కోట్లు ఈ ఐదేళ్లలో రావాల్సిన పన్నులున్నాయన్నారు. హైదరాబాద్ లో రోడ్ ట్యాక్స్ నుంచి 10 శాతం జీహెచ్ ఎంసీకి రావాలనీ, అదీ రావడం లేదన్నారు. నగరంలో శాశ్వత నిర్మాణాలైన రోడ్లుగానీ, ఫ్లైవోర్లుగానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలనీ, కానీ జీహెచ్ ఎంసీ నుంచి నిధులతో ఈ పనులు చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలు సాధించుకోవాలంటూ పార్లమెంటులో తెరాస ఎంపీలు మాట్లాడతారనీ, కానీ రాష్ట్రంలో జీహెచ్ ఎంసీకి ఇవ్వాల్సిన నిధులూ బకాయిలూ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు? రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్దమొత్తంలో బకాయిలుపడితే జీహెచ్ ఎంసీ ఎందుకు ప్రశ్నించకుండా ఉపేక్షిస్తోందో అర్థం కావడం లేదన్నారు. మొత్తానికి, దాదాపు 20 నిమిషాలకుపైగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఈ సందర్భంగా బలంగానే ప్రశ్నించారు. గత సమావేశాలను కూడా రేవంత్ రెడ్డి ఇలానే వినియోగించుకున్నారు. గత సమావేశంలో ఎమ్మార్ ఆస్తులు, కేసీఆర్ సన్నిహితులకు చెందిన భూముల గురించి ఆరోపణలూ విమర్శలు చేశారు. జీహెచ్ ఎంసీ సర్వసభ్య సమావేశానికి రేవంత్ వస్తారంటేనే అందరికీ గుబులురేపుతోందనే చెప్పాలి. ఎందుకంటే, ఆయన వేసిన ప్రశ్నలకు కౌన్సిల్ లో సమాధానం చెప్పేవారే లేరు!