హైదరాబాద్: తెలుగుతేజం అంబటి రాయుడు నిన్న భారతజట్టును పరాభవం అంచులనుంచి తప్పించాడు. హరారేలో నిన్న జింబాబ్వేతో ఆడిన వన్డేలో రాయుడు బాహుబలిలాగా ఒంటిచేత్తో భారత జట్టును గట్టెక్కించి అందరి ప్రశంశలూ అందుకున్నాడు. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి భారతజట్టు ఒకదశలో ఇబ్బందుల్లో పడిపోయింది. బాంగ్లాదేశ్ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో వన్డే సిరీస్ కోల్పోయిన భారతజట్టుకు మరో పరాభవం తప్పదేమోనని అనిపించింది. ఈ సమయంలో రాయుడు అభిమానులకు మళ్ళీ ఆశలు చిగురింపజేశాడు. 133 బంతుల్లో 124 పరుగులు చేసి జట్టుకు పటిష్ఠమైన స్కోరు అందించాడు. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. తన రెండో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందిచిన రాయుడుకు తెలుగు క్రీడాభిమానులు జేజేలు పలుకుతున్నారు. అతను గత ఏడాది శ్రీలంకతో మ్యాచ్‌లోకూడా అద్భుతమైన సెంచరీ(110 బంతుల్లో 121 నాటౌట్) చేసి ఆదుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సెంచరీతో తానెంత విలువైన ఆటగాడినో రుజువు చేశాడు.