స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా తనను తొలగిస్తూ… తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. కాసేపటికే… నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. హైకోర్టు తీర్పు మేరకు తాను.. ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నానని ప్రకటించారు. వ్యక్తులు కాదని.. రాజ్యాంగ వ్యవస్థలు.. విలువలు ముఖ్యమని ప్రకటించారు. ఇంతకు ముందు లానే తాను నిష్ఫక్షిపాతంగా పని చేస్తానని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుని.. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్తానని ప్రకటించారు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాలుగేళ్ల కిందట నియమితులయ్యారు. చట్టం ప్రకారం.. ఆయనకు అరవై ఐదేళ్లు లేదా.. పదవీ కాలం ఐదేళ్లు పూర్తయ్యే వరకూ పదవిలో ఉండాలి. ఈ రెండూ పూర్తి కాలేదు. అయితే.. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నచ్చని ప్రభుత్వం సంస్కరణల పేరుతో ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. తొలగించింది. దాన్ని కోర్టులో సవాల్ చేసినరమేష్ కుమార్ తన పదవిని మళ్లీ పొందారు. రమేష్ కుమార్ మళ్లీ ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకోవడంతో… స్థానిక ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ పార్టీల్లో ప్రారంభమయింది.
రమేష్‌కుమార్‌ను తొలగించడానికి ముందు ఆయన.. కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉన్నారు. ప్రభుత్వం వాటిని తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాలన్నీ అమల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఎస్ఈసీ కనగరాజ్ వచ్చిన తరవాత కొన్ని ఆదేశాలిచ్చారు. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పినందున.. అవి కూడా చెల్లుబాటయ్యే అవకాశాలు లేవు.