గురువారం ఒక్కసారిగా టాలీవుడ్ వేడెక్కింది. బాలకృష్ణ కామెంట్లు, నాగబాబు కౌంటర్లతో… వాతావరణం మారింది. మొన్నటి వరకూ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి? థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? అని ఆసక్తిగా ఎదురు చూసిన జనం… ఇప్పుడు బాలయ్య గొడవ ఏ మలుపు తిరుగుతుంది? చిరంజీవి కాంపౌండ్ ఎలాంటి సమాధానం చెబుతుంది? అనే విషయంపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఓ మీటింగ్ ఏర్పాటైంది. కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. బాలయ్య కామెంట్లపై ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్నదానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోందని టాక్. నిజానికి ఈ మీటింగ్ మొన్నే ఫిక్స్ అయ్యింది. సీసీసీ పేరుతో చేస్తున్న చారిటీని ఈ నెల కూడా కొనసాగించే విషయంలో సీసీసీకి చెందిన ప్రముఖులు ఓ కీలక నిర్ణయం తీసుకోవాలన్నది ప్రధాన ఎజెండా. అందుకోసమే మీటింగ్ పెట్టినా, టాపిక్ మొత్తం బాలయ్య వ్యాఖ్యలవైపు టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండ్రస్ట్రీలో గ్రూపు రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వంతో చిత్రసీమ పెద్దలు సంప్రదింపులు చేయడం వల్ల పెద్దగా ఫలితాలుండవు.
`ముందు మీలో మీరు ఓ అండర్ స్టాండింగ్కి రండి` అని కేసీఆర్ చెప్పినా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఇక ముందు ఎలా ముందుకు వెళ్లాలి? షూటింగుల విషయంలో ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలి? అనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలుసుకోవాలని టాలీవుడ్ పెద్దలు ఇది వరకే ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ సమావేశానికి బాలకృష్ణను పిలవాలా? వద్దా? ఇప్పుడు పిలిస్తే ఆయన్నుంచి వచ్చే రియాక్షన్ ఏమిటి? పైగా జగన్తో మీటింగ్ అంటే ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ బాలకృష్ణ ఏమంటాడు? ఇలా అన్నీ చిక్కుముడులే. మరి ఈ మీటింగులో చివరికి ఏం తేలుతుందో?