నమోః వేంకటేశాయ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు దర్శకేంద్రుడు. ఆయన సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. దర్శకేంద్రుడు రిటైర్ అయిపోయారని, ఆయన ఇక సినిమాలు చేయరని వార్తలొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ ప్రకటించాలన్నది దర్శకేంద్రుడి ఉద్దేశం. అందుకే ఓ ప్రాజెక్టు సెట్ చేశారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లు, ఓ హీరోతో సినిమా చేయాలన్నది ఆయన ప్లాన్. యేడాది క్రిందటే.. ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగింది. ఇప్పటికి లైన్లోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే ప్రకటిస్తానని దర్శకేంద్రుడు చెబుతున్నారు.
అయితే.. ఈక్రేజీ ప్రాజెక్టు వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఇది మూడు ఉప కథలతో సాగే సినిమా. మూడు ఉపకథల్లోనూ హీరో ఒక్కడే. హీరోయిన్లే మారతారు. ఈ మూడు కథల్నీ ముగ్గురు దర్శకులకు ఇచ్చి డైరెక్ట్ చేయమంటారు. ఆ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ కమ్ నిర్మాత.. రాఘవేంద్రరావునే. ఓ దర్శకుడిగా క్రిష్ని అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి లాంటి యువ దర్శకులూ… రాఘవేంద్రరావు మదిలో ఉన్నారు. ఈమధ్య మంచి విజయాలు అందుకున్న కొంతమంది యంగ్ డైరెక్టర్స్ లిస్టు తయారు చేశారు రాఘవేంద్రరావు. అందులో ఒకరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తారు. హీరో కూడా యంగ్ బ్యాచ్లోంచే తీసుకుంటారు. ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ పేరు, ఒక్కో దర్శకుడి పేరు బయటపెడుతూ.. చివరికి హీరోని రివీల్ చేస్తారు. ఈ యేడాది చివర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.