ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి… రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత లేదనే వాదన వినిపిస్తున్నారు. మరికొంత మంది.. సీఎంగా జగన్ రాజీనామా గురించి కాకుండా.. ఇప్పటికైనా మంచి సలహాదారుల్ని నియమించుకోవాలని.. మెప్పు కోసం తప్పుడు సలహాలిచ్చే వారిని కాదనే సలహాలు… ప్రతిపక్ష పార్టీల్లో ఉండి… వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవారితో పాటు.. తటస్థులుగా చలామణి అవుతూ.. వైసీపీ శ్రేయోభిలాషులైన మేధావులు సూచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా డిమాండ్ రాజకీయమే కానీ.. సలహాదారుల విషయంలో మాత్రం ఆయన సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఎస్ఈసీ తొలగింపు నిర్ణయం న్యాయస్థానంలో నిలవదని… ప్రాథమిక అవగాహన ఉన్న ఏ న్యాయవాది అయినా చెబుతారు. కానీ.. వివాదాస్పదంగా… ఎస్ఈసీని తొలగించి.. ఇప్పుడు నేరుగా ఆర్డినెన్స్ రద్దు ద్వారా పరువు పోగొట్టేలా సలహాలిచ్చిన వారిని తక్షణం జగన్ తప్పించాల్సి ఉందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు .. సలహాలిచ్చేందుకు దాదాపుగా ప్రతీ విభాగంలోనూ సలహాదారులున్నారు. ఇటీవలి డిప్యూటీ అడ్వైజర్స్ ను కూడా నియమిస్తున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు.. వీరందరూ.. తమతమ పరిధిలో సలహాలిస్తున్నారో లేదో అర్థం కాని పరిస్థితి. మీడియా సలహాదారులుగా చెప్పుకునే మరికొంత మంది… జాతీయ మీడియాలో ప్రభుత్వాన్ని మరింత చులకన చేస్తున్నారు కానీ.. సరైన వాదన వినిపించలేకపోతున్నారు. తక్షణం ఈ సలహాదారుల్ని మార్చుకోకపోతే.. మరిన్ని ఎదురు దెబ్బలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
అయితే.. జగన్మోహన్ రెడ్డి.. ఎవరి మాటా వినరని.. సలహాదారులకు.. గతంలో వారు చేసిన సేవలకు గుర్తుగా.. జీతభత్యాలతో కూడిన సలహాదారు పదవి ఇచ్చారు కానీ.. నిజంగా ఎవరి సలహాలు తీసుకునే ఉద్దేశం .. తీసుకునే అలవాటు జగన్ కు లేదనే వాదన కూడా ఉంది. ఆయనే నిర్ణయాలు తీసుకుంటారని.. అంటున్నారు. నిజమోకాదో కానీ.. సలహాదారులే ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం అయితే.. వారిని తక్షణం తొలగించాల్సిందేననే అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.