ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .. జనం పెదవి విరిచేసేంత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి పాలనది కూడా అదే పరిస్థితి. తాను వస్తే ఏం చేస్తారో.. ” త్రీడీ ” లో ప్రజలకు చూపించి .. అంచనాలు పెంచేసుకున్న జగన్మోనహన్ రెడ్డి.. ఏడాదిలో ఆ అంచనాలను అందుకోలేకపోయారు. ఒక్క సంక్షేమ రంగంలో మాత్రం.. కాస్త అందుకునే ప్రయత్నం చేశారు. మిగతా రంగాలను ఆయన కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నాళ్లో వేచిన ఉదయం … గత ఏడాది మే 30వ తేదీన సాక్షాత్కరించింది. ఏళ్ల తరబడి తాను ఎదురు చూసిన ముఖ్యమంత్రి పదవిని ఆయన ఆ రోజు చేపట్టారు. విజయవాడలో సువిశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ వేదికపై నుంచి చాలా మాట్లాడారు. 50 శాతం ఓట్లు.. 80శాతానికిపైగా సీట్లతో గొప్ప విజయం సాధించిన జగన్..తాను పదవి చేపడుతున్న సందర్భంగా ఆంతులేని ఆత్మవిశ్వాసం కనబరిచారు. పీపీఏల్లో బోలెడంత అవినీతి జరిగిందని ప్రకటించి విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గించేస్తానన్నారు. ఐదేళ్ల టీడీపీ హయాంలోని అవినీతి ఆరు నెలల్లో ప్రజల ముందు పెడతానన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా.. పథకాల లబ్ది అందిస్తామన్నారు. ఇలా.. అన్నీ చెప్పి.. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నారు. అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది.
నవరత్నాల పథకాల అమల్లో మెరుపులు..!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. తనకు అధికారం తెచ్చిపెట్టింది నవరత్నాలు అనే నమ్మకం ఉంది. ఇంకేం చేసినా చేయకపోయినా ఆ పథకాలు అమలు చేస్తే.. మళ్లీ మళ్లీ తనదే విజయమని ఆయన నమ్ముతున్నారు. అందుకే.వాటి అమలులో రాజీ పడటం లేదు. ప్రతీ ఏడాది మేలో రైతు భరోసా ఇస్తానని ప్రకటించారు. పదవి చేపట్టే నాటికే మే నెలాఖరు వచ్చేసింది. దాంతో అక్టోబర్‌లో రైతు భరోసా ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చారు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులూ ఇచ్చారు. ఇలా.. సంక్షేమ పాలనలో తనదైన ముద్రవేస్తూ పోతున్నారు. కానీ.. ఇంకా చేయాల్సిన పనులు చాలా మిగిలే ఉన్నాయి. 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 75వేల సాయం.. డ్వాక్రారుణాల మాఫీ ఇందులో భారీగా నిధులు అవసరం అయినవి. ఓ మాదిరిగా పథకాలు అమలు చేసిన తొలి ఏడాదిలోనే… రూ. 80వేల కోట్లకుపైగా అప్పు చేశారు. పూర్తి స్థాయి పథకాలను ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంటుంది. ఇంకెంత మేర అప్పు చేస్తే అ నిధులు సమకూరుతాయో.. అంచనా వేయలేని పరిస్థితి.
తగ్గిపోయిన ప్రభుత్వ ఆదాయం..పడిపోయిన ప్రజల జీవన ప్రమాణాలు..!
వైసీపీ అధికారం చేపట్టిన ఏడాదిలో ప్రజల ఆదాయం… భారీగా పడిపోయింది. ప్రభుత్వం అధికారం చేపట్టగానే ముందూవెనుక ఆలోచించకుండా… ఇసుక లభ్యతను నిలిపివేసింది. కొత్త విధానం తెచ్చేలోపు.. వర్షాకాలం వచ్చింది. దీంతో ఆరు నెలల పాటు ఇసుక లేదు. నిర్మాణ రంగం ఆగిపోయింది. ఫలితంగా నిర్మాణ రంగానికి సంబంధించి అన్ని విభాగాల వ్యాపారాల టర్నోవర్ తక్కువగా నమోదయింది. ఆ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వం ఖర్చు పెట్టడం మానేసింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. పోలవరం నెమ్మదిగా సాగుతోంది.. ఇతర ప్రాజెక్టుల్లో అత్యధికం.. రివర్స్ టెండర్ల పేరుతో.. ఆగిపోయాయి. ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. చివరికి గ్రామాల్లో చేపట్టాల్సిన రోడ్లు.. ఇతర పనులకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులను ఆపేశారు. ప్రభుత్వ ఖర్చు తగ్గిపోయింది. ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. సాధారణం .. ఈ ఏడాది వెయ్యి రూపాయలు సంపాదిస్తే.. వచ్చే ఏడాది 1100 సంపాదించాలి… అలా చేస్తే.. వృద్ధి ఉన్నట్లు కాదు .. కనీస ఆదాయాన్ని కాపాడుకున్నట్లు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే.. గత ఏడాది వెయ్యి విలువ .. ఇప్పటి వెయ్యికి సమానం కాదు. ఆ లెక్కన చూస్తే.. ఆదాయం తగ్గిపోతే.. పరిస్థితి దారుణం అయినట్లే. ఏపీ ఆ పరిస్థితినే ఎదుర్కొంటోంది. రెవిన్యూ , పెట్టుబడి వసూళ్లు 2018-19 ఆర్థిక సంవత్సరంలో లక్షా ఎనిమిది వేల ఏడు వందల కోట్లుగా… జగన్ సీఎం అయిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆ వసూళ్లు 98వేల 790 కోట్లు మాత్రమే. అంటే పదివేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వానికే అంత మేర ఆదాయం తగ్గిందంటే.. ప్రజలు అంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఆదాయం కోల్పోయి ఉంటారు.
పడకేసిన పారిశ్రామిక రంగం..!
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. ఏపీలో ఓ భారీ పరిశ్రమ అంటూ లేదు. దాంతో పారిశ్రామిక రంగంపై గత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐటీ నుంచి ఆటోమోబైల్ వరకూ.. అనేక రంగాల్లో దిగ్గజాలనదగ్గ పరిశ్రమలు వచ్చాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సన్ రైజ్ ఏపీని ప్రమోట్ చేశారు. ఐదేళ్లలో ఏపీకి 15 లక్షల 61వేల కోట్ల పెట్టుబడులు రాగా.. 32 లక్షల 55వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామిక వేగం పూర్తిగా మందగించింది. ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోగా.. మరికొన్ని పరిశ్రమలు తమంతటా తమే ప్రతిపాదనలు విరమించుకున్నాయి. పాతిక వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందనుకున్న ఏపీపీ పేపర్ పరిశ్రమ మరోసారి ఏపీ వైపు చూడలేదు. జియో ఫోన్ల ప్లాంట్ ఊసే లేకుండా పోయింది. ఆదాని శంకుస్థాపన కూడా చేసిన 70వేల కోట్ల డేటా సెంటర్ పెట్టుబడి తెలంగాణకు వెళ్లిపోయింది. కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చాయా అంటే.. ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదు. జగన్ సీఎంఅయిన తర్వాత జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ 1,600 కోట్ల పెట్టుబడితో కొత్తగా టైర్ల తయారీ కంపెనీ పెడతామని వచ్చింది. చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో శ్రీకాళహస్తిలో భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను పెట్టబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది తిరిగే సరికి.. ఆ సంస్థలు ఏమయ్యాయో.. పెట్టుబడులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఏడాది పాలనపై మన పాలన – మీ సూచన పేరుతో.. నిర్వహిస్తున్న సమీక్షల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పలేకపోయారు. కానీ.. 1400 కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటితో పాటు 20 పెద్ద కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడానికి ఆసక్తిని చూపుతున్నాయన్నారు. ఆ కంపెనీలేంటో.. వివరాలేంటో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం చెప్పేదాకా సస్పెన్స్. పరిశ్రమల కోసం.. కొత్తగా చేసిన ప్రయత్నాలు మొదటి ఏడాదిలో ఏమీ లేవు. పెట్టుబడుల సదస్సును నిర్వహించలేదు. ప్రపంచ పెట్టుబడిదారులంతా వచ్చే… దావోస్ ఆర్థిక సదస్సుకు కూడా ఆంధ్రప్రదేశ్ బృందం వెళ్లలేదు. పైగా అక్కడ ఏపీ సర్కార్ చేపట్టిన పీపీఏల రివ్యూపై.. నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దాంతో ఏపీ ప్రభుత్వంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లినట్లయింది. ఒక్క ఏడాదిలో ఏం జరిగిందని వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఏపీలో పెట్టుబడి పెడతామన్న కంపెనీలు వెనక్కి తగ్గడమే కానీ.. కొత్తగా పెట్టుబడి పెడతామంటూ.. వచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదని చెప్పక తప్పదు.
ఏడాది పూర్తయినా విద్య, వైద్య రంగాలపై ఇప్పటికీ ప్రణాళికలే..!
విద్య , వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు, నేడు పేరుతో.. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఏడాది దాటినా.. వాటికి సంబంధించిన ప్రణాళికలపై చర్చ నడుస్తోంది కానీ ఇప్పటి వరకూ పనులు ప్రారంభం కాలేదు. వాటి పేరు చెప్పి.. బిల్డ్ ఏపీ పేరుతో.. భూములు అమ్మేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం అంటే.. విద్యా ప్రమాణాలు పెంచడం కూడా. అయితే.. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లిష్ మీడియాన్ని నిర్బంధంగా అమలు చేయడమే.. విద్యా ప్రమాణాలు పెంచడంగా భావిస్తున్నారు. చదువు చెప్పే అధ్యాపకుల్లో ఆ స్థాయి ఉందో లేదో అంచనా వేయలేకపోతున్నారు.
మీడియా, ప్రతిపక్షాలపై కక్ష సాధింపుల్లో అంచనాలకు మించి…!
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది పాలనలో.. మనం మర్చిపోలేని అంశం రాజకీయ కక్ష సాధింపులు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నవారిని పరువు ప్రతిష్టలతో టార్గెట్ చేసి..వారిని మానసికంగా హింసించే కొత్త రకం రాజకీయాలు ఏపీలో ప్రారంభం అయ్యాయి. నేరుగా చంపడం కాదు.. వారంతటికి వారే ఆత్మహత్య చేసుకునేంతటి భయంకర రాజకీయం ఏడాది పాటు నడిచింది. అధికారులనూ వేధించారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకు ఇప్పుడు పోస్టింగులు జీతాలు లేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే.. ఏదో ఓ కారణం చెప్పి సస్పెన్షన్ వేటు వేసిన దృశ్యాలు కోకొల్లలుగా కనిపించాయి. మాస్కులు ఇవ్వలేదని విమర్శలు చేసిన డాక్టర్ సుధాకర్ కు ఇప్పుడు ఏ పరిస్థితి పట్టిందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇష్టం లేని మీడియాపై జరుగుతున్న కక్ష సాధింపులు అన్నీ ఇన్నీ కావు. కేబుల్ ఆపరేటర్లను బెదిరించి చానళ్లను నిలిపివేయించారు. పత్రికలకు ప్రకటనలు ఆపి వేయించారు. ఆర్థికంగా కుంగదీసే అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని చూపిస్తున్న చిన్న చిన్న యూట్యూబ్ చానల్స్ నూ వదిలి పెట్టలేదు.
ప్రజలు ఐదేళ్ల పరిపాలన కోసం… వైసీపీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పటికి ముగిసింది ఏడాదే. మొత్తంగా పైకి మంచి చేశామని చెప్పుకోవచ్చు కానీ.. అంతర్గతంగా అయినా చేసిన తప్పుల్ని విశ్లేషించుకుని పాలనను మెరుగు పర్చుకుంటే ముందు ముందు మెరుగైన ఫలితాలొస్తాయి. ఎదురే లేదనుకుని గుడ్డిగా ముందుకెళ్తే ఎదురుదెబ్బలే తగులుతాయి.
పంచ్ లైన్ : ప్రభుత్వం చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత
రేటింగ్ : 2.5/ 5