మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ అనర్హతా వేటు ప్రక్రియ ప్రారంభించారు. విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు ఎందుకు వేయరాదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు పంపారు. జూన్ 3 మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత ఎప్పుడైనా వారిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం మండలిలో టీడీపీకే మెజార్టీ ఉంది. మండలి చైర్మన్ .. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావడం లేదు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో.. ఆయన ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపైనా నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువ ప్రకారం.. పార్టీ మారే వారిపై తక్షణం వేటు వేయాల్సి ఉంటుంది. అలా వేటు వేయడం ఇష్టం లేక.. ఆయన నేరుగా పార్టీలో చేర్చుకోకుండా మద్దతుదారులుగా మార్చుకుంటున్నారు. కానీ ఎమ్మెల్సీ విషయంలో వారు విప్ ధిక్కరించి దొరికిపోయారు. దాంతో.. పదవులు ఊడటం ఖాయంగా కనిపిస్తోంది.
శాసనమండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఆ తీర్మానం బిల్లుగా మారి ఆమోదం పొందడానికి అనువైన పరిస్థితులు లేవు. ఈ లోపు.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. ఖచ్చితంగా మండలిని కూడా సమావేశపర్చాల్సి ఉంటుంది. దీని వల్ల.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు పడటం వల్ల.. వైసీపీకి ఎలాంటి అదనం ప్రయోజనం కలిగే పరిస్థితి లేదు.