వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని చక్క బెడతారు.. ఇటు తెలంగాణ సర్కార్‌తో వ్యవహారాలు నడుపుతారు.. అదే సమయంలో.. ఏపీలో పార్టీ కార్యక్రమాల్ని.. ఉత్తరాంధ్రలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌ని సైతం సమన్వయ పరుస్తారు. నిన్నామొన్నటిదాకా పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా.. పని అయినా… విజయసాయిరెడ్డినే సంప్రదించమని.. జగన్మోహన్ రెడ్డి సూచించేవారు. అయితే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు.. పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో చూసుకునేందుకు .. మరో కీలక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి పవర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇందు కోసం.. సజ్జల ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. రోజూ ఆయన కేంద్ర కార్యాలయానికి వచ్చి కొంత సేపు పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించబోతున్నారని చెబుతున్నారు. ఇక పార్టీ తరపున ఎలాంటి పనులకైనా.. విజయసాయిరెడ్డిని సంప్రదించరాదనే సంకేతాలు.. పార్టీలోని.. ఓ స్థాయి నేతలకు చేరినట్లుగా తెలుస్తోంది. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా.. ఈ పరిణామం.. వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారనే సందేహాలు..వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఆయన ఉత్తరాంధ్రలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో.. పంచిన సరుకుల సంచుల్లో జగన్ బొమ్మ లేదు. పూర్తిగా విజయసాయిరెడ్డి బొమ్మే ఉంది.
అదే సమయంలో… ఓ సందర్భంలో విజయసాయిరెడ్డి.. సుజనా చౌదరికి హెచ్చరికలు చేస్తూ.. ఆయన దగ్గర తాను పని చేశానని ఆ లొసుగులన్నీ తెలుసని హెచ్చరించారు. ఇది సుజనాకు చేసింది కాదని..నేరుగా జగన్‌కు చేసిందనే అనుమానాలు వైసీపీలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందన్న చర్చ ప్రారంభమయింది. ఈ మార్పు.. ఆ కోవలోకేనా.. లేక.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది.. ఆ పార్టీలో జరిగే పరిణామాల్ని బట్టి బయటకు తెలిసే అవకాశం ఉంది.