ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఘటన జరగినప్పుడు సహజంగా.. విపక్ష పార్టీల నేతలు తక్షణం స్పందిస్తారు. అలాంటి విషయాలపై ఎలా ఎదురుదాడి చేయాలో ఆలోచించుకుని కౌంటర్‌తో ముందుకు వస్తారు అధికార పార్టీ నేతలు. కానీ.. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం దానికి భిన్నం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా.. ఆయన తెరమీదకు వచ్చేస్తున్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ తీర్పు వెలువడిన కొద్ది సేపటికే ఆయన స్పందన మీడియాకు వచ్చింది. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని… ఎస్ఈసీ రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్‌తో పదవి నుంచి తీసేయడం కరెక్ట్ కాదనేశారు. అలాంటి ఆర్డినెన్స్‌లు తేవడం ఇకనైనా ఆపాలని సలహా కూడా ఇచ్చారు. అయితే ఆయన పార్టీ విధానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇది ఒక్కటే కాదు.. ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఆయన నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో కొంత మంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఆరోపణలు గుప్పించారు. ఇలా చేయగలిగేది అధికార పార్టీ నేతలు లేకపోతే అధికారులు అయి ఉంటారు. ఎవరినో టార్గెట్ చేసి రఘురామకృష్ణంరాజు ఆ విమర్శలు చేశారని సులువుగానే అర్థమైపోతుంది. ఇక.. తిరుమల శ్రీవారి భూముల అమ్మకం విషయంలోనూ అందరి కంటే ముందుగా స్పందించి.. ప్రభుత్వం తప్పు చేస్తోందని తేల్చేశారు. తాను శ్రీవారి ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకమని ప్రకటించేశారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో.. ఆయన పార్లమెంట్‌లోనే సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి నచ్చలేదో… ఆయన ప్రకటనలు తేడాగా ఉన్నాయని అుకుంటున్నారో కానీ.. వైసీపీలో పెద్దగా ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. అదే సమయంలో.. ప.గో జిల్లాలో వైసీపీ నేతలు ఎంపీని పరిగణనలోకి తీసుకోకుండా… పార్టీ వ్యవహారాలు నడిపించేస్తున్నారు. ఆ అసంతృప్తితోనే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. వైసీపీలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయడం లేదు.. ఒక్క రఘురామకృష్ణం తప్ప.. అందుకే ఆయనేం మాట్లాడినా హైలెట్ అవుతోంది.