భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. న్యాయస్థానాల గౌరవాన్ని నిలబెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ సాల్వే నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. న్యాయవ్యవస్థను తిట్టడం.. బెదిరించడం.. సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం.. వంటి అంశాలను హరీష్ సాల్వే ప్రస్తావించారు.
సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థకు భంగం వాటిల్లుతున్న వైనంగా జరిగిన ఓ సమావేశంలో చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిణామాలను ఆయన చాలా ప్రమాదకరంగా అభివర్ణించారు. రాజకీయపార్టీ నాయకులు నేరుగా న్యాయమూర్తులను దూషిస్తూ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని .. అలా చేయడం వల్ల.. వ్యవస్థలకు ఎక్కడ గౌరవం దక్కుతుందని ప్రశ్నించారు. హరీష్ సాల్వే అభిప్రాయాలు.. విస్తృత చర్చకు కారణం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఏపీలో న్యాయవ్యవస్థపై ఓ రకమైన దాడి జరుగుతోందన్న అభిప్రాయం ఉన్నత స్థాయిలో ఏర్పడిన నేపధ్యంలో సాల్వే వ్యాఖ్యలు చర్చకు కారణం అవుతున్నాయి.
హరీష్ సాల్వే దేశంలోని అత్యంత సీనియర్ న్యాయ, రాజ్యాంగ నిపుణుల్లో ఒకరు. గతంలో సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. అంతర్జాతీయ కోర్టులో కులభూషణ్ జాదవ్ తరపున వాదించి గెలిపించి తీసుకు వచ్చిన న్యాయవాది కూడా హరీష్ సాల్వేనే. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా సాల్వేకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో క్వీన్స్ కౌన్సిల్‌గా ఉన్నారు.