లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్.. అన్లాక్ విషయంలో మాత్రం.. వెనుకడుగు వేస్తోంది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే.. ఏడు రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ.. ఆదేశాలిచ్చింది. రైళ్లలో వచ్చే వారు కూడా.. క్వారంటైన్ నిబంధనలు అమలు చేయాల్సిదేనని తేల్చి చెప్పడమే కాదు.. రైల్వే శాఖకు.. రైళ్లన్నింటినీ అన్ని చోట్లా నిలుపవద్దని.. ప్రధాన స్టేషన్లలోనే నిలపాలని.. ఓ జాబితాను అంద చేసింది. దాంతో.. వివిధ స్టేషన్లకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
ఇక బస్సు ప్రయాణాల విషయంలోనూ ఇదే నిబంధన పాటించనున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం.. ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించాలనుకున్నప్పుడు.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుని అంత్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించాలని ఆదేశించారు. అప్పుడు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. తెలంగాణ సర్కార్ అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేసింది. ఎలాంటి టెస్టులు.. క్వారంటైన్ నిబంధనలు లేకుండా.. వచ్చిపోయేలా.. అవకాశం ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం… వెనుకడుగు వేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉండిపోయిన ఏపీ వాసులు… మరికొంత కాలం.. ఇబ్బంది పడక తప్పదంటున్నారు.
కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెబుతున్న ఏపీ సీఎం.. ఆ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించి.. జనజీవనం సాధారణ స్థితికి వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే.. దాదాపుగా అన్ని వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. వీలైనంత వరకు ఆంక్షలు తగ్గించారు. అయితే తెలంగాణ నుంచి ఏపీకి రావాలనుకుంటున్న వారి విషయంలో మాత్రం.. అనేక ఆంక్షలు పెడుతూండటం… అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల తీరు సరిగా లేదని.. విమర్శలు వస్తున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి చెక్ పోస్టుల వద్ద ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి.