విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలకు ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ ఉండదు. ఈ ఏడాది కరోనా దెబ్బకు.. టెన్త్ విద్యార్థులకు జీవితానికి సరిపడా టెన్షన్‌ను ముందే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సగం పరీక్షలు జరిగిన తర్వాత లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దాదాపుగా రెండున్నర నెలల పాటు మిగతా పరీక్షల కోసం చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధపడగానే.. మళ్లీ కరోనానే అడ్డం వచ్చింది. గ్రేటర్లో అంతకంతకూ కేసులు పెరిగిపోతూండటంతో.. హైకోర్టు పరీక్షలు నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మిగిలిన చోట్ల నిర్వహించుకోవచ్చని చెప్పింది కానీ… ఒక చోట ఆపి.. మరో చోట నిర్వహించడం సాధ్యం కాదు.
దీంతో ప్రభుత్వం.. అసలు పరీక్షల్ని క్యాన్సిల్ చేసేయాలనే ఆలోచన చేస్తోంది. పంజాబ్ ప్రభుత్వం ప్రభుత్వ పరీక్షలను రద్దు చేసేసింది. ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించి.. పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఈ విధానంపై తెలంగాణ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు.. పూర్తయ్యాయి. వాటిని ఆయన స్కూళ్లు వాల్యూయేట్ చేసి ఉంటాయి. ఈ కోణంలో ఓ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. హైకోర్టు తీర్పు కాపీ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత.. ఆదివారం.. సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇందులో టెన్త్ పరీక్షలపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్ని పరిగణనలోకి తీసుకోకుండా..ప్రీ ఫైనల్ పరీక్షల ప్రాతిపదికగా అప్ గ్రేడ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకే ఎక్కువ సమయం కేటాయించి కసరత్తు చేస్తున్నారు. పొరుగురాష్ట్రం ఏపీలో మాత్రం.. టెన్త్ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించారు. కానీ అక్కడా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.