చిత్రసీమ కరోనాకు ముందు – ఆ తరవాత.. గా మారబోతోంది. ఇప్పుడు కొత్త నియమ నిబంధనలు కనిపించబోతున్నాయి. ఎవరి రూల్స్ వాళ్లవి. దర్శకులు కూడా ఓ గైడ్ లైన్స్ తయారు చేసుకోబోతున్నారు. ఇండ్రస్ట్రీలో గత వారం రోజుల నుంచి దర్శకుల మీటింగులు దశల వారీగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో దర్శకుల విధి విధానాల గురించి ప్రధానంగా చర్చ సాగుతోంది. షూటింగ్ టైమింగ్స్, అడ్వాన్సులు, నష్టభారం.. ఇలాంటి విషయాల్ని ప్రముఖంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇది వరకు ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే, బడ్జెట్ పెరిగితే.. దర్శకుడిపై భారం పెరిగేది. నష్టపరిహారంగా తన పారితోషికంలో కొంత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. అది అలిఖిత నిబంధన. దర్శకుల మీటింగులో ఈ విషయంపై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఓ సినిమా పోతే, దర్శకుడు నష్టపరిహారం ఇవ్వాలా? డిమాండ్ చేసే హక్కు నిర్మాతలకు ఎంత వరకూ ఉంది? అనే విషయంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు – నిర్మాత మధ్య జరిగే ఎగ్రిమెంట్ లో ఎలాంటి విషయాలు పొందుపరచాలో విపులంగా చర్చించారని టాక్. నష్టభయాలు వీలైనంత తగ్గించుకునే విధంగా కొన్ని నియమ నిబంధనలు రూపొందించార్ట. వాటికి ఒప్పుకుంటేనే ఏ బ్యానర్ లో అయినా సినిమా చేయాలని దర్శకులు డిసైడ్ అయినట్టు టాక్.