సహాయ దర్శకులకు సుకుమార్ ఇచ్చే గౌరవం అలా ఇలా ఉండదు. సొంత సోదరుల్లా చూసుకుంటాడని టాక్. వాళ్లు ఎదగాలని.. అనుక్షణం తపన పడుతుంటాడు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, ఇప్పుడు ఉప్పెన, 18 పేజీస్ సినిమాలు సహాయ దర్శకుల కోసమే తీశాడు. ఉప్పెనపై సుకుమార్ పెట్టిన ఫోకస్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో తనకు అత్యంత ప్రియమైన సహాయ దర్శకుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ కథని ఫైనల్ చేసింది, మైత్రీతో కలిసి పట్టాలెక్కించింది సుకుమారే.
లాక్ డౌన్ వల్ల.. సుకుమార్ పుష్ష సినిమా ఆలస్యం అయ్యింది. ఇది పరోక్షంగా `ఉప్పెన`కు కలిసొచ్చింది. ఉప్పెన సినిమా పై సుకుమార్ ఇప్పుడు మరింత ఫోకస్ పెట్టాడు. ఫైనల్ వెర్షన్ కట్ తో సహా… అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమాకి దర్శకుడు బుచ్చిబాబా? సుకుమారా? అన్న అనుమానం కూడా వేస్తోందట. అంతలా ఈ ప్రాజెక్టులో సుకుమార్ ఇన్వాల్వ్ అయ్యాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రేపు ఈ సినిమా హిట్టయితే, పేరంతా బుచ్చి బాబుకే వస్తుంది. తద్వారా బుచ్చిబాబుకి మరిన్ని అవకాశాలు దొరుకుతాయి. ఓ గురువుగా.. సుకుమార్‌కి కావాల్సింది కూడా అదేనేమో..? పరిశ్రమలో చాలామంది దర్శకులున్నారు. వాళ్లదగ్గర చాలా మంది శిష్యులున్నారు. కానీ ఏ దర్శకుడూ.. తన శిష్యుల గురించి ఇంతలా తాపత్రయపడలేదు. ఈ విషయంలో సుకుమార్ మిగిలిన దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.