జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మనిర్భర ప్యాకేజీ బాగుందని ఓ ప్రెస్‌నోట్‌ను.. జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలా.. మధ్య తరగతి జీవితానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుందని అందులో ప్రశంశల వర్షం కురిపించారు. ఎలా మేలు చేస్తుందో.. కొన్ని ఉదాహరణలు చెప్పారు. 2013లో హౌసింగ్ లోన్లు పది శాతం వడ్డీకి వచ్చేవని.. ఇప్పుడు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకే వస్తున్నాయని పవన్ చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనితో పాటు.. ఆత్మనిర్భర ప్యాకేజీలోప్రకటించిన క్యాష్ రిజర్వ్ రేషియోల్లో మార్పులు.. ఇతర అంశాలన్నింటీ పవన్ పొడిగారు. అవన్నీ లాక్డౌన్ వల్ల మధ్య తరగతి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని సంతోషం వెలిబుచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ… సమయం..సందర్భం లేకుండా… ఆత్మనిర్భర ప్యాకేజీపై ఈ రివ్యూను ట్విట్ చేయడం ఏమిటన్నదానిపై చాలా మందిలో సందేహం కలుగుతోంది. ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించి.. ఇరవై రోజులు పైనే అవుతోంది. మే పన్నెండో తేదీన నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా ప్రెస్మీట్లు పెట్టి.. ప్యాకేజీల్లోని అంశాలను వివరించారు. వాటిపై ఎవరు చేయాల్సిన విశ్లేషణలు వాళ్లు చేశారు. ఎవరికి అర్థమయింది వారు చెప్పారు. రాజకీయపార్టీలు తమకు ఎంత కావాలో అంత విశ్లేషించాయి. ఆ ఎడిసోడ్ అయిపోయింది. ఆ ప్యాకేజీ పాతబడిపోయింది.
అయితే.. హఠాత్తుగా పవన్ కల్యాణ్ ఇప్పుడు.. ఆ ప్యాకేజీపై ఎందుకు రివ్యూ చేశాలో మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. బహుశా పవన్ కల్యాణ్ అప్పటి నుంచి సీరియస్‌గా ప్యాకేజీని స్టడీ చేసి.. ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. రాజకీయాల్లో దేనికైనా టైమింగ్ ఉండాలి. ఏ అంశంపై వేడి ఉన్నప్పుడు.. ఆ ఆంశంపై స్పందించాలి. అది పొలిటికల్ రాడార్ నుంచి పోయిన తర్వాత స్పందిస్తే.. పద్దగా పట్టించుకునేవాళ్లు ఉండరు. మరి జనసేనాని దీన్ని తెలుసుకుంటారో లేదో..?