దాసరి నారాయణరావు ఇది వరకు పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. సమస్యల్నీ ఆయన తన నెత్తిమీద వేసుకుని పరిష్కరించేవారు. ఆయన సినిమా పంచాయితీ పెద్ద. ఫిల్మ్‌నగర్ పెదరాయుడు. అయితే ఆయన మరణంతో.. ఆలోటుని చిరంజీవి తీరుస్తున్నారు. ఓ విధంగా దాసరి కుర్చీలో ఆయన కుర్చున్నట్టే లెక్క. ఇటీవల చిత్రసీమలోని పలు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో గానీ, కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకునే విషయంలో గానీ, చిరు పెద్ద మనిషి బాధ్యత తీసుకున్నారు. అయితే.. ఈ పెద్దరికం కొంతమందికి నచ్చడం లేదు. అందుకే గొడవలు మొదలయ్యాయి. కొంతమంది అలుగుతున్నారు.
వీటిపై ఇప్పుడు నాగబాబు స్పందించారు. తన అన్నయ్య ఇండ్రస్ట్రీకి పెదరాయుడేం కాదని, కానీ.. ఈమధ్య ఇండ్రస్ట్రీ సమస్యల్ని చురుగ్గా ముందుండి పరిష్కరిస్తున్నారని, అలాంటి వ్యక్తి పరిశ్రమకు కావాలని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండ్రస్ట్రీ ఏ ఒక్కరి సొత్తూకాదని, ఇక్కడ బాస్‌లు ఎవరూ లేరని, ఎవరైనా సరే, పెద్ద మనిషిగా వ్యవహరించి, బాధ్యతలు పంచుకోవచ్చని చెబుతున్నారు నాగబాబు.
”దాసరి గారు పెద్ద మనిషిగా బాధ్యతల్ని తన నెత్తిమీద వేసుకున్నారు. ఆయనకు ఓపిక, సహనం చాలా ఎక్కువ. ఆయన తరవాత.. మా అన్నయ్య ముందుకొచ్చారు. ఎవరో ఒకరు సమస్యల్ని సర్దుబాటు చేయడానికి ముందుకు రావాలి. అది నాగార్జున కావొచ్చు, కృష్ణగారి కుటుంబం కావొచ్చు, నందమూరి కుటుంబం కావొచ్చు. అందరూ తలో చేయి వేస్తే మంచిదే కదా. ఇండ్రస్ట్రీ అంటే నాలుగు కుటుంబాలది కాదు. ఎవరైనా రావొచ్చు. ఎదగొచ్చు. అప్పట్లో అన్నయ్య అలా వచ్చి ఎదిగిన వాడే. ఇప్పుడు రవితేజ, విజయ్ దేవరకొండ.. వీళ్లెవరికీ బ్యాక్ గ్రౌండ్ లేదు. అయినా ఎదిగారు.. సత్తా ఉన్నవాళ్లంతా ఎదిగారు. లేనివాళ్లు నిలబడలేదు. అంతే తేడా” అని చెప్పుకొచ్చారు.