ఎప్పుడు సరదాగా ఉంటాడో తెలీదు
ఎప్పుడు అభిమానులకు చెంపదెబ్బల గిఫ్టు విసురుతాడో చెప్పలేం.
మైకు పట్టుకుంటే శ్లోకాలు వరుస కడతాయి.
ఇంకా మూడొస్తే పాటలు పుట్టుకొస్తాయి.
మనసులో ఉన్నది ఉన్నట్టుగా కక్కేయడం అలవాటు.
ఫామ్, క్రేజ్ లెక్కలు వేసుకోకుండా.. ఎలాంటి దర్శకుడికైనా ఛాన్స్ ఇవ్వడం తన స్టైల్.
గెటప్పులు, హెయిర్ స్టైలింగ్సు, డైలాగులు, టైటిల్సు.. అన్నిట్లోనూ వెరైటీ.
వీటన్నింటికీ చిరునామా… ఇంకెవరు.. మన నందమూరి అందగాడు, బాలకృష్ణ.
బాలకృష్ణ అంటే పౌరుషానికి ప్రతిరూపమైన పాత్రలు, భారీ డైలాగులు, వంశాల చరిత్ర, ఫ్యాషన్ కథలు ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. నిజానికి బాలకృష్ణ అంటేనే వైవిధ్యం.
పౌరాణికాలకు కేరాఫ్ బాలయ్య. అగ్ర హీరోల్లో పౌరాణికాల్ని టచ్ చేసే ధైర్యం ఒక్క బాలయ్యకే సొంతం.
భైరవద్వీపంతో జానపదం కూడా చేసేశాడు బాలకృష్ణ. ఆ సినిమాలో బాలయ్య నట వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వయసులోనూ… కురూపిగా నటించడం ఓ సాహసం. సైన్స్ ఫిక్షన్ అంటారా… `ఆదిత్య 369` కంటే గొప్ప కథ ఏముంది? ఇప్పటికీ ఆ సినిమా ఓ మెరాకిల్. ఫ్యాక్షన్ కథల పుట్టుక, విజృంభణ బాలయ్య దగ్గరే. నారీ నారీ నడుమ మురారి లాంటి ఫక్తు అత్త కథలెన్ని చేశాడని? శ్రీరామరాజ్యం చేసి – ఎన్టీఆర్ తరవాత రాముడి పాత్రల్ని పోషించగల దమ్ము నాకే ఉందని నిరూపించుకున్నాడు. శ్రీకృష్ఱ దేవరాయుల అవతారం ఎత్తాడు. బయోపిక్‌లు చేశాడు.. ఇలా ఒకటా, రెండా..? – ఇన్నేళ్ల కెరీర్ గ్రాఫ్‌లో చేయాల్సిన పాత్రలన్నీ చేసేశాడు. చేయాల్సినవి మిగిలిలేవని తేల్చేశాడు.
బాలయ్య వయసు ఇప్పుడు 60. కానీ ఆయన ఎనర్జీ 16 దగ్గరే ఆగిపోయింది. సిక్ట్సీకీ.. సిక్స్టీన్కీ పలకడంలో పెద్ద తేడా లేదుగా. అందుకే బాలయ్య ఎప్పటికీ పదహారేళ్లవాడే.