ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ.. జారీ చేసిన ఆర్డినెన్స్, జీవోలను హైకోర్టు కొట్టి వేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రతీవాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. వెంటనే.. ఇతర అధికారిని ఎస్ఈసీగా నియమించాలన్న వ్యూహంలో ఏపీ సర్కార్ ఉంది. దీంతో ఏపీ సర్కార్ ప్రయత్నాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. విచారణ సందర్భంగా జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతో ఆడుకోవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అసలు అలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ఆశ్చర్యం ప్రకటించారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరగా లేవని..జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినందు వల్ల హైకోర్టు తీర్పు ప్రకారం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఆపడం ఇక ప్రభుత్వం చేయలేదని కూడా చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే చెల్లదనే వాదనను ఏపీ సర్కార్ వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తన వాదన విన్న తర్వాత ఆదేశాలివ్వాలని పలువురు కేవియట్లు దాఖలు చేయడం కూడా… ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినట్లుగా కనిపిస్తోంది.
సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది కాబట్టి.. ఈ లోపు ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కీలకాశంగా మారింది. జస్టిస్ బాబ్డే వ్యాఖ్యలతో.. ప్రభుత్వానికి భంగపాటు తప్పదనే అంచనాలు న్యాయనిపుణుల్లో వినిపిస్తున్నాయి. గతంలో.. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్… కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలనుకున్నారు. కానీ ఆగిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి… ఆయన కొత్తగా ఎలాంటి పిటిషన్లు వేయకపోవచ్చని చెబుతున్నారు. అయితే.. హైకోర్టు తీర్పు స్టే రానందున ఆయన బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.