కొన్ని పాటల్ని ముట్టుకోకూడదు. వాటిని విని.. ఆనందించాలి. పరవశించి పోవాలి. అంతే. అంతకు మించి ఏం చేయలేం. చేయకూడదు కూడా. `శివ శంకరి` కూడా అలాంటి గీతమే. గాన గంధర్వుడు అని పిలుచుకునే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ పాటకు చేతులెత్తి దండమెట్టారు. `నేను ఎప్పుడూ ప్రయత్నించకూడదు` అని ఒట్టు పెట్టుకున్న పాట ఇది అని సగర్వంగా చెప్పారు.
చాణ్నాళ్ల క్రిందటి మాట ఇది. ఓ కార్యక్రమంలో శ్రోతలంతా కలిసి `శివ శంకరీ పాట మీ నోట నుంచి వినాలని వుంది` అని బాలూని అభ్యర్థించారు. ఓ పేరున్న టీవీ కోసం చేస్తున్న షో. పైగా అభిమానుల అభ్యర్థన. బాలు లాంటి గాయకుడు కాదనలేడు. కానీ.. ఆయన సింపుల్గా `నో` చెప్పారు.
“రాగాలతో, తాళాలతో కూడా భక్తి భావాల్ని కురిపించగల అపురూపమైన పాట అది. ఆ పాటని ఘంటసాల గారు తప్ప మరెవ్వరూ పాడలేరు. తెలుగునాట అత్యుత్తమ గీతాలలో మొదటి స్థానంలో ఉండే పాట. దాన్ని పాడాలంటే కనీసం నెల రోజుల కసరత్తు అవసరం. అంత క సరత్తు చేసి పాడినా.. ఘంటసాల గారి దగ్గరకు కూడా వెళ్లలేను. మీరు అడిగారని ఇప్పటికిప్పుడు పాడలేను. పాడి ఆ పాట విలువ తగ్గించలేను. ఇలాంటి పాటే.. `భైరవద్వీపం`లో పాడే అవకాశం వచ్చింది. కానీ… ఆ పాట కూడా `శివ శంకరీ` తరవాతే“ అంటూ సున్నితంగా తిరస్కరించారు.
అదీ శివ శంకరీ మహిమ. ఇప్పుడు ఈ మేటర్ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే… ఈ పాటని బాలకృష్ణ తనదైన స్టైల్లో పాడేశారు. ఆ పాట ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. బాలయ్య ప్రయత్నం బాగుందని కొంతమంది మెచ్చుకుంటే, గొప్ప పాటని గొంతు మీద వేసుకుని బాలయ్య మోయలేకపోయారని, అలాంటి పాటని ఎంచుకోకుండా ఉండాల్సిందని ఇంకొంత మంది హితవు పలుకుతున్నారు. బాలూ లాంటి వాళ్లే భయపడిన పాటని, బాలకృష్ణ పాడారంటే.. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.