మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ వార్త ఆ పార్టీకి చెందిన మీడియాలోనే వచ్చింది కనుక అది నిజమనే భావించవచ్చును. ఆయన తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావుకి సన్నిహితుడు. గనుక ఆయన ఈ వార్తపై తక్షణమే స్పందించారు. డొక్కా వైకాపాలో వెళతారని తాను భావించడం లేదని రాయపాటి అన్నారు. అంటే డొక్కా వైకాపాలో చేరడం ఆయనకి ఇష్టం లేదని చెపుతున్నట్లే భావించవచ్చును. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ నేతలకు అధికార తెదేపాలోకి వచ్చే అవకాశం లేనప్పుడు, పార్టీ మారాలనుకొంటున్నకాంగ్రెస్ నేతల ముందు ఉన్నవి రెండే రెండు అవకాశాలు. వైకాపా లేదా బీజేపీలో చేరడం. తెదేపా, బీజేపీలలో చేరే అవకాశం లేనివారు సహజంగానే వైకాపావైపు మళ్ళవలసి వస్తుంది. బహుశః బొత్స, డొక్కా వంటి నేతలు అందుకే వైకాపాలో చేరుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. బొత్స సత్యనారాయణ తరువాత ఆ వైకాపాలో చేరబోతున్న మొట్ట మొదటి కాంగ్రెస్ నేత ఆయనే. కనుక ఆయనని వైకాపాలో చేరడానికి బొత్స సత్యనారాయణ ప్రోత్సాహించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అదే నిజమయితే త్వరలోనే మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపాలోకి ప్రవేశిస్తారేమో! అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత అద్వానంగా మారవచ్చును.