ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్న వారు.. వైసీపీని.. జగన్ను పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఆయన సంగతి తెలుసు కాబట్టి.. ఆయనను అదుపు చేయాల్సిన భారతీయ జనతా పార్టీనే నిందిస్తున్నారు. ఓ వైపు అమరావతికే మా మద్దతు అని చెప్పడం.. మరో వైపు.. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని.. కేంద్రానికి సంబంధం వితండ వాదం చేయడంతోనే అసలు సమస్య వచ్చింది. బీజేపీ నేరుగా ముందుకు మూడు రాజధానుల విధానానికే మా మద్దతు అని ప్రకటించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆ పార్టీకి.. రాజకీయంగా వచ్చేది..పోయేది ఏమీ ఉండదు. కానీ జనసేనతో పొత్తు కోసమో.. మరో కారణమో కానీ పైకి అమరావతికి మద్దతుగా ఉంటున్నారు. లోపలికి.. మాత్రం.. వైసీపీ నిర్ణయాలను సమర్థిస్తున్నారు.
రాజధాని మార్పుతో కేంద్రానికి సంబంధం లేదని.. బీజేపీ నేతలు చెబుతున్న మాటలు.. సామాన్యుల్లో కామెడీ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడం వల్లే ఏపీ ఏర్పడింది… రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయడం వల్లనే… ప్రస్తుత వ్యవస్థలు ఏర్పడ్డాయి.. అలాంటప్పుడు.. కేంద్రానికి సంబంధం లేదనడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. సరే.. వారు చెప్పినట్లుగా.. చట్ట పరంగా కేంద్రానికి ఎలాంటి సంబంధం లేకపోవచ్చు.. అమరావతికి మద్దతు.. అని చెబుతున్నప్పుడు… రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదనే చర్చ సహజంగానే అందరిలోనూ వస్తోంది. పైగా.. అలాంటి తేకపోగా.. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని పదే పదే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రకటనలు చేయడంతో.. బీజేపీ ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిపోయింది.
గవర్నర్ నిర్ణయంలో ఢిల్లీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతికి మద్దతుగా నిలబడుతున్న.. కన్నా లక్ష్మినారాయణను తొలగించి.. రాత్రికి రాత్రి.. సోము వీర్రాజును నియమించి… ఆ తర్వాత ఆయనను ఢిల్లీకి పిలిపించి చేయించిన ప్రకటనలతోనే.. ఏదో జరగబోతోందని అర్థం అయింది. కన్నా లక్ష్మినారాయణను.. వైసీపీ నేతలు అత్యంత దారుణంగా విమర్శించినా.. పట్టించుకోని నేతలు.. సుజనా చౌదరి అమరావతికి మద్దతుగా ఎప్పుడూ చేసే వ్యాఖ్యలను చేస్తే… ఆయన పేరు ప్రస్తావించి మరీ ఖండించినప్పుడే… ఇదంతా బీజేపీ ప్లాన్ అని తేలిపోయిందనే భావన ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు అటు గవర్నర్ నిర్ణయం వెలువడగానే ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి.. చేసిన పాత వితండవాదం.. మళ్లీ ప్రజలకు కొత్తగా చిరాకు తెప్పించింది.
అమరావతి విషయంలో.., భారతీయ జనతా పార్టీనే ఇప్పుడు బకరా అయింది. వైసీపీ మూడు రాజధానుల విధానానికే గట్టిగా మద్దతుగా నిలబడింది. తాము అమరావతిని మార్చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పకపోయినా.. కులం ముద్ర వేసి.. అవినీతి మరకలు వేసి.. తాము చేయాలనుకున్నది చేస్తున్నారు. టీడీపీ అమరావతికే ఫిక్సయింది. బీజేపీ మాత్రమే… అమరావతే కానీ.. మాకేం సంబంధం లేదంటూ… తేడా మాటలు మాట్లాడుతూ.. ప్రజల ముందు బకరా అయింది.