ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారికి పాస్ కష్టాలు తప్పాయి. ఇప్పటి వరకూ స్పందన యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వ యంత్రాంగం వారి ఇష్టం వచ్చినప్పుడు పాస్ పంపిస్తుంది. అది ఉంటేనే..ఏపీలోకి అనుమతిస్తారు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చారు. స్పందన యాప్‌లో పేరు నమోదు చేసుకున్న వెంటనే… పాస్ మంజూరయ్యే విధానాన్ని తీసుకు వచ్చారు. సరిహద్దుల్లో అయినా నమోదు చేసుకోవచ్చు. ఆ నెంబర్‌ను చెక్ పోస్టుల్లో ఇచ్చి.. ఏపీలోకి వెళ్లొచ్చారు. ఆ వివరాల ఆధారంగా.. ఏపీలోకి వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య కార్యకర్తలు సమీక్షిస్తారని.. అధికారులు చెబుతున్నారు.
లాక్ డౌన్ విధించినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడానికి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం అన్‌లాక్ నిబంధనలు ప్రకటించినప్పుడు.. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదని ప్రకటించారు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం.. వాటిని పట్టించుకోలేదు. పాస్‌లు ఉంటేనే ఏపీలోకి అనుమతిస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ కారణంగా సరిహద్దుల్లో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు.. ఈ విధానం మార్చారు. అయితే.. ఖచ్చితంగా పాస్ తీసుకోవాలని మాత్రం చెబుతున్నారు.
పాస్ కేవలం వివరాల నమోదుకు మాత్రమేనని… అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక హైదరాబాద్ నుంచి లేదా.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వెళ్లడానికి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మాత్రం అందుబాటులో లేదు. బెంగళూరుకు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి కానీ.. హైదరాబాద్‌కు మాత్రం సర్వీసులు ప్రారంభించలేదు. దీంతో సొంత వాహనాలు ఉన్న వారు మాత్రమే…ప్రయాణాలు చేయగలుగుతున్నారు.