ఆంధ్రప్రదేశ్ వేల కోట్లు అప్పు చేస్తోంది. కాగ్ రిపోర్టుల ప్రకారం.. మూడు నెలల్లో చేసిన అప్పు మొత్తం రూ.33,294 కోట్లు. అంటే గంటకు తొమ్మిది కోట్ల చొప్పున అప్పు చేస్తున్నారు. బడ్జెట్లో ఏడాది మొత్తం మీద యాభై వేల కోట్లు అప్పు చేస్తామని ప్రతిపాదించారు. కానీ మూడు నెలల్లోనే రూ. 33వేల కోట్లు చేసేశారు. ఇప్పుడు ఎఫ్బీఎం పరిమితిని మరో రెండు శాతం.. అంటే మొత్తం ఐదు శాతం పెంచుకోవడానికి చట్టం మార్చుకున్నారు . దీని ద్వారా మరో ఇరవై వేల కోట్లకుపైగా అప్పు చేయవచ్చు. అయితే.. ఇన్ని వేల కోట్లు అప్పు ఏం చేస్తున్నారన్నది సామాన్యులకు అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ఏపీ ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ. 54,375.74 కోట్లు. ఇందులో రూ. రూ.33,294 కోట్లు అప్పు. మిగతాది కేంద్ర పన్నుల్లో వాటా.. రాష్ట్ర పన్నుల ఆదాయం. ఈ మూడు నెలల్లో ఖర్చు పెట్టిన మొత్తం రూ.54,335 కోట్లు. అంటే.. వచ్చినది మొత్తం ఖర్చు పెట్టారు. కేంద్రం ఇచ్చినది.. పన్నుల రూపంలో వచ్చినది.. అప్పుల రూపంలో తీసుకొచ్చినది ఇలా మొత్తం… ఖర్చు పెట్టేశారు. ఈ మొత్తం దేనికి ఖర్చు పెట్టారో స్పష్టత లేకుండా పోయింది. ఎందుకంటే.. జీతభత్యాల ఖర్చు.. ఐదు నుంచి ఏడు వేల కోట్ల మధ్యలోనే ఉంటుంది. మిగతా ఖర్చులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తేనే తెలిసిపోతుంది.
సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా.. అప్పుల రూపంలో తీసుకొచ్చే నిధులను సంపద పెంచడానికి అంటే.. అభివృద్ది కార్యక్రమాలకు వినియోగిస్తాయి. అలా చేస్తేనే అప్పు తిరిగి కట్టగలిగే స్థితి వస్తుంది. ప్రస్తుతం.. గత మూడు నెలల కాలంలో.. ఏ అభివృద్ది పనీ జరగలేదు. పోలవరం సహా ఏ ప్రధాన ప్రాజెక్టులోనూ పనులు సాగడం లేదు. ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ముందడుగు పడలేదు. పేదలకు ఇళ్లు కూడా నిర్మించలేదు. దాంతో తీసుకొస్తున్న అప్పు అంతా అనుత్పాదక వ్యయంగా కనిపిస్తోంది.