బీహార్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.అంటే ఇక కరోనా భయాలను పక్కన పెట్టి అయినా తప్పక నిర్వహించాల్సిన వాటిని నిర్వహించి తీరాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లుగా భావించవచ్చు. ఇక త్వరలో ఉపఎన్నికల తేదీలను కూడా ప్రకటిస్తామని ఈసీ చెబుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు ఈసీ ప్రత్యేక జాగ్రత్తలు ప్రకటించారు. వాటిని పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేయనున్నారు. అంటే అవే నిబంధనలతో..స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించవచ్చు. ఏపీలో ఈ ఎన్నికలు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అందరి చూపు.. ఏపీ ఎస్ఈసీ వైపు పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దాంతో ఆ ప్రక్రియ ఎక్కడిక్కకడ ఆగిపోయింది. సగం.. సగం జరిగిన ఆ ప్రక్రియ మొత్తం వివాదాస్పదమే. పైగా ఓ ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన చట్టం ప్రకారం ఆ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఆర్డినెన్స్ మురిగిపోయింది. అదే ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేశారు. అయితే.. ఇప్పుడు అది చెల్లుతుందా లేదా అనే సందేహం ఉండనే ఉంది. వీటన్నింటిని మధ్య ఎస్ఈసీ రమేష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారేది ఆసక్తికరం.
ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వంతో ఆయన సంప్రదించాల్సి ఉంది . కానీ ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్ఈసీ ఎలాంటి ప్రతిపాదనలు పంపినట్లుగా సమాచారం లేదు. అయితే.. బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక వేళ.. నెలాఖరులో ప్రకటిస్తారని భావిస్తున్న ఉపఎన్నికల షెడ్యూల్ లో… తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఉంటే ఆ ఎన్నిక పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కాలం ఆపే అవకాశం ఉండదనే అంచనా ఉంది.