కరోనా సోకి బాలు ఆసుపత్రి పాలవ్వడం, ఆ తరవాత క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం – కరోనా నుంచి కోలుకున్నా, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల, బాలు పరిస్థితి చేయి జారిపోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. బాలు లాంటి వ్యక్తులు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. బాలు అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకున్నారు. కచేరీలు పూర్తిగా తగ్గించేశారు. బయటకు వెళ్లినా – అన్ని రకాల జాగ్రత్తలతోనే వెళ్లేవారు. అయినా సరే, ఆయనకు కరోనా సోకింది. దాంతో బాలుకి అసలు కరోనా ఎలా సోకింది? దానికి కారణం ఏమిటి? అనే విషయాలు ఆరా తీస్తున్నారంతా.
ఓ టీవీ ఛానల్ కోసం బాలు సంగీత ధారావాహిక నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. బాలు ప్రతీసారి చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడం పరిపాటి. అయితే కరోనా వల్ల ఆయన రావడానికి చాలా భయపడ్డారు. కానీ టీవీ ఛానల్ వాళ్లు పదే పదే ఫోన్ చేసి `పోగ్రాంకి రావాల్సిందే` అని ఒత్తిడి చేయడంతో, ఆయన కాదనలేక.. హైదరాబాద్ వచ్చినట్టు, ఇక్కడ మూడ్రోజుల పాటు ఉండి, ఎపిసోడ్స్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బాలుతో పనిచేసిన ట్రూప్ లో కొంతమందికి కరోనా ఉందని, వాళ్ల ద్వారా బాలుకి కరోనా సోకి ఉండొచ్చని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాక బాలు కి కరోనా సోకిందని నిర్దారణ అయ్యిందని సన్నిహితులు చెబుతున్నారు. అలా… బాలు కరోనా బారీన పడాల్సివచ్చింది.