మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై హైకోర్టు ఓ కేసులో స్టే ఇచ్చింది కానీ.. ప్రభుత్వం మరో కేసు పెట్టింది. ఓ సివిల్ తగాదా విషయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన దాన్ని బట్టి కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి, ఆయన భార్యపై మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని.. కోడె రాజా రామ్మోహన్ అనే బిల్డర్ ఫిర్యాదు చేశారు. దీంతో దమ్మాలపాటి బావమరిదితో పాటు మొత్తం నలుగురిపై కేసు ఫైల్ చేశారు. తాను దమ్మాలపాటి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో.. కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్టుమెంట్ ప్లాట్లు నిర్మించానని .. ప్లాట్ విషయంలో తనను మోసం చేశారనేది రామ్మోహన్ ఫిర్యాదు.
అసలు ఈ కేసు నమోదు విషయంలో ఏపీ పోలీసులు తమ మార్క్‌ను చూపించారు. ఎందుకంటే… కోడె రాజారామ్మోహన్ అనే బిల్డర్ దమ్మాలపాటితో కానీ ఆయన భార్యతో కానీ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించ లేదు. దమ్మాలపాటి బావమరిది తో పార్టనర్‌షిప్‌గా వ్యాపారం చేశారు. అందులో ఏదో వివాదం వచ్చింది. దాంతో… ఆయన వచ్చి దమ్మాలపాటితో పాటు ఆయన భార్యపైనా కేసు పెట్టారు. అసలు సంబంధం లేని వ్యక్తిపై కేసు ఎలా పెట్టారన్నది పోలీసులకే తెలియాలి. పైగా అది సివిల్ వివాదం. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి. కానీ కుటుంబసభ్యుల భాగస్వామ్యంతో వ్యాపారం చేశానని ఆ వ్యాపారి చెప్పడం పోలీసులు నమోదు చేయడం అంతా సాఫీగా సాగిపోయింది.
ఇలాంటి కేసులు పెడితే.. న్యాయస్థానాలు ఘాటు వ్యాఖ్యలు చేయక ఏం చేస్తాయని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏజీగా పని చేసిన వ్యక్తిపైనే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెడుతున్నారంటే.. ఏపీలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ కేసుల అంశాన్ని టీడీపీ అన్ని విధాలుగా హైలెట్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది.