ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు వరుసగా చేతులు మారుతున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును అదానీ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టు కూడా చేతులు మారబోతోంది. జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌ను గత వారం భారీ డీల్‌తో దక్కించుకున్న అరబిందో రియాల్టీ కంపెనీ.. ఈ కాకినాడ పోర్టుపైనా కన్నేసింది. అత్యధిక వాటాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. జీఎంఆర్ సంస్థ.. తమకు కాకినాడ సెజ్‌లో తమకు ఉన్న వాటాల్లో 51 శాతాన్ని అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 2,610 కోట్లకు అమ్మేసింది. జీఎంఆర్ సెజ్ కింద తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వద్ద దాదాపు పది వేల ఎకరాల ఉన్నాయి. కోన అనే గ్రామం వద్ద నూతన పోర్టు నిర్మించాల్సి ఉంది.
ఇప్పుడు ఈ పోర్టు కట్టాల్సిన అవసరం లేకుండా.. నేరుగా కాకినాడ పోర్టునే టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందా అని అరబిందో రియాల్టీ యజమానులు దృష్టి పెట్టారు. ఇప్పటికే అరబిందో రియాల్టీ ప్రతినిధులు కాకినాడ పోర్టును పరిశీలించారు. కొన్ని లెక్కలు చూసుకున్నారు. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహం వస్తోంది. దాంతో డీల్ సెట్ చేసుకునేందుకు ప్రజోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రేపో మాపో.. కాకినాడ పోర్టు కూడా అరబిందో రియాల్టీ చేతుల్లోకి వెళ్తుందన్న ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
అరబిందో ఫార్మా ప్రమోటర్లు నాలుగేళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ప్రధానంగా హైదరాబాద్‌లో నివాస, వాణిజ్య భవనాలను ఈ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగంలోఈ సంస్థ అనుభవం.. రెండేళ్లకు అటూ ఇటూగానే ఉంది. ఒక రెసిడెన్షియల్, రెండు కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించింది కానీ.. ఇప్పటికి పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా పోర్టులు.. సెజ్‌లను కైవసం చేసుకునే దిశగా అడుగు వేస్తోంది. భిన్నమైన వ్యాపార అవకాశాల కోసం పరుగులు పెడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత భిన్నమైన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాకినాడ పోర్టు ఓనర్ కెవీ రావు. ఆయన వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో కాకినాడ పోర్టు కోసం ఎన్నో రాయితీలు ఇచ్చారు. ఆ పోర్టు విషయంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ అవినీతి విషయంలో అనేక ఆరోపణలు చేసిన టీడీపీ ఈ కేవీ రావు విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ అనూహ్యంగా వైఎస్ కుమారుడు జగన్ సీఎం అయిన తర్వాత ఆ పోర్టు పై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. ఇప్పుడు.. నేరుగా చేతులు మారేందుకు చర్చలు జరుపుతున్నారు. జీఎంఆర్‌కు మొదట.. భోగాపురం ఎయిర్ పోర్టు క్యాన్సిల్ చేశారు. తర్వాత ఐదు వందల ఎకరాలు తగ్గించి అదే సంస్థకు కట్టబెట్టారు. ఆ తర్వాత జీఎంఆర్ నుంచి సెజ్ అరబిందో ఫార్మా చేతికి వెళ్తోంది.