బాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయాన్ని హైదరాబాద్‌కు చుట్టబెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూండటంతో.. ఆమె పేరును లింక్ చేసి రాజకీయ ఆరోపణలు ప్రారంభించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్.. ఈ విషయంలో చిత్రమైన ఆరోపణలు చేస్తూ.. మీడియాకు లేఖ పంపారు. ముంబై డ్రగ్స్ కేసుతో హైదరాబాద్‌కు లింకులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసును తొక్కేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగలేదు.. రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో చాలా మంది పేర్లు ఉంటే.. ఒక్క రకుల్‌ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సంపత్ కుమార్ తన లేఖలో వివరించలేదు. తెలుగు సినిమాల్లో నటించినంత మాత్రాన రకుల్ ను కాపాడాలని.. తెలంగాణ ప్రభుత్వం అనుకోదుగా..! పైగా… రకుల్ తాను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం లేదు. రెండేళ్ల కిందట.. చాట్ చేశానని చెబుతోంది. అంతకు ముందు ఎన్సీబీ వద్ద ఆధారాలు కూడా లేవని … దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. అటువంటప్పుడు.. కాపాడటం అనే ప్రశ్న ఎలా వస్తుందో.. సంపత్.. ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశారో స్పష్టత లేకుండా పోయింది.
తనపై ఇలాంటి రాజకీయాలు చేస్తారని రకుల్ ముందుగానే గ్రహించింది ఏమో కానీ.. డ్రగ్స్ కేసు విషయంలో తన పేరుతో ఎలాంటి వార్తలు వేయకుండా మీడియాను నియంత్రించాలని మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేశారు. బహుశా.. ఈ విషయాన్ని హైలెట్ చేయడానికి సంపత్ కుమార్ రకుల్ పేరును ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.