మేం ముంచేస్తాం.. మీ చావు మీరు చావండి అంటే.. అక్కడి ప్రజలు ఏం చేస్తారు.. ? అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోవాలి. లేకపోతే.. ఆ నీటికే ప్రాణాలు బలి ఇవ్వాలి. ప్రస్తుతం కడప జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు అనే గ్రామస్తుల ఆవేదన ఇదే. గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామం తాళ్ల ప్రొద్దుటూరు. అక్కడ నిర్వాసితులకు పరిహారం చెల్లించి ఖాళీ చేయించాలి. పరిహార ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కట్టించి ఇవ్వాల్సి ఉంది. ఇంత వరకూ కనీసం ఇళ్లకు పునాదులు తవ్వలేదు. కానీ ప్రాజెక్ట్ నిండా నీటిని నింపుతున్నారు. ఫలితంగా ఆ గ్రామం నీటి ముంపులోకి చిక్కుకుపోతోంది.
తమను ముంచ వద్దని అక్కడి ప్రజలు అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే… అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడకు వచ్చి చెబుతోంది ఒక్కటే. తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోవాలని. అంతా నిరుపేదలు.. ఎక్కడికి వెళ్తారనే కనీస ఆలోచన అధికారులు చేయడం లేదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం.. పునరావాస ప్యాకేజీ ఇస్తే.. వెళ్లిపోతామని.. అంటున్నారు. కానీ ఏప్యాకేజీ లేదు.. ముందు పోవాలని అధికారులు అంటున్నారు. నీటి ముంపును పెంచుతూనే ఉన్నారు. తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తుల వ్యధను పక్క గ్రామాల వారు కూడా పట్టించుకోవడం లేదు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఈ గ్రామస్తుల బాధల గురించి పదే పదే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. గండికోట రిజర్వాయర్ ముంపు నుంచి తాళ్ళప్రొద్దుటూరు గ్రామస్తులను కాపాడాలని.. కోరుతున్నారు. పరిహారం అందనందున ఇక్కడే ఉంటామని కాలనీవాసులు చెబుతున్నారు. వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదు, వృద్దులు, చిన్నారులు సైతం వరద నీటిలో చిక్కుకున్నారు, తాళ్ళప్రొద్దుటూరు విడిచే వరకు గ్రామస్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. గండికోట నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నిర్వాసితులతో అధికారులు సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలని రాజకీయ పార్టీలు కోరుతున్నా ప్రభుత్వ స్పందన లేదు. నీరు వదిలితే.. నీటి మునగకుండా వెళ్లిపోతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.