అంబటి రాంబాబు వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరుగా మారుతున్నారు. ఆయన వరుసగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ సొంతపార్టీ నేతలు చేస్తూండటమే ఇందులో ట్విస్ట్. మరో ఏడాదిలో జరగనున్న మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ బెర్త్ కోసం పెద్ద ఎత్తున రేస్ నడుస్తోంది. సామాజిక సమీకరణలతో పాటు విధేయత పరంగా కూడా అంబటి రాంబాబుకు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే గుంటూరులో రెడ్డి సామాజికవర్గం నేతలు బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారే తన ఇమేజ్ డ్యామేజ్ చేసి బెర్త్ దక్కకుండా చేసేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని అంబటి రాంబాబు అనుమానిస్తున్నారు.
అంబటి రాంబాబుపై ఇటీవల అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం విచారణ దశలో ఉండగానే మరో రెండు వివాదాలు అంబటిని చుట్టుకున్నాయి. అంబటికి అత్యంత న్నిహితులైన ఇద్దరు నేతలు రెండు భూములను కబ్జా చేశారు. వాటి వివరాలు వైసీపీ నేతల నుంచే మీడియాకు అందాయి. బెదిరింపుల ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలపై విచారణకు కూడా ఆదేశించారు. అధికారులు భూములను పరిశీలించారు. అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో అంబటి ఇరుక్కుపోయినట్లయింది.
రెపల్లేకు చెందిన అంబటి రాంబాబుకు సత్తెనపల్లితో ఎలాంటి సంబంధం లేదు. సామాజికవర్గం బలంతో సత్తెనపల్లిలో అంబటి పాగా వేశారు. అయితే సత్తెనపల్లి స్థానిక వైసీపీ నేతలకు రాంబాబుపై అంత సానుకూలత లేదు. ఇప్పుడు తమ ప్రాంతం నుంచి మంత్రి పదవికే పోటీ వస్తున్నారని తెలిసి.. ఇతర నేతలూ రగిలిపోతున్నారు. అందుకే సత్తెనపల్లిని అంబటి రాంబాబు ఆదాయవనరుగా మార్చుకున్నాని… పార్టీ కోసం తాము ఏళ్ల తరబడి కృషి చేసినా.. ఇప్పుడు తమకు ఎలాంటి ప్రయోజనం కల్పించకుండా మొత్తం అంబటినే సొంతం చేసుకుంటున్నారన్న ఆగ్రహం పార్టీ నేల్లో కనిపిస్తోంది. అది హైకోర్టులో పిటిషన్లు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే వరకూ వెళ్లింది. ఇవే కాదు.. అంబటి గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ నేతల అంతర్గత రాజకీయాల్లో అంబటి ఇరుక్కుపోయారు.