భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం కూర్పు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించింది. రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వాళ్లను పక్కన పెట్టడం… తేజస్వి సూర్య లాంటి వారికి పట్టం కట్టడమే దీనికి కారణం. అయితే.. ప్రాధాన్యం తగ్గిన నాయకులకు ప్రభుత్వంలో పదవులు ఇస్తారని చెబుతున్నారు. అంటే.. పార్టీ వ్యవహారాలతో వారికి ఇక సంబంధం లేనట్లే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ శ్రేయోభిలాషులుగా పేరు పొందిన వారందర్నీ ఒక్క సారిగా పార్టీ వ్యవహారాల నుంచి పక్కన పెట్టేశారు. వైసీపీకి ఢిల్లీలో స్ట్రాంగ్‌గా ఉండే లీడర్‌గా రామ్‌మాధవ్‌కు పేరు ఉంది. అలాగే జీవీఎల్ తెర ముందే వైసీపీకి మద్దతు ప్రకటిస్తూంటారు.
పాలనలో లోపాలు ఎత్తి చూపకపోగా.. గతంలో టీడీపీ కూడా అలాగే చేసింది కదా అంటూ.. అనధికారిక ప్రతినిధి అన్నట్లుగా వైసీపీకి సపోర్ట్ చేసేవారు. ఢిల్లీలో ఇలాంటి పలుకుబడి గల నేతలు ఇప్పుడు బీజేపీలో ఎలాంటి ప్రభావం చూపకుండా అయిపోవడం మాత్రం వైసీపీ షాక్లాంటిదేనంటున్నారు. అదే సమయంలో… వైసీపీ పొడ ఏ మాత్రం గిట్టని పురందేశ్వరికి పదవి ఇచ్చారు. పురందేశ్వరిని కారణంగా చూపి… దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి బయటకు పంపేశారు. వారి కుమారుడికి రాజకీయభవిష్యత్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. అలాగని టీడీపీతోనూ ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవు. నిఖార్సుగా బీజేపీ కోసం పని చేయగలరు. అలాగే కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ వెంకయ్యనాయుడు శిష్యుడు.
ఆయన వైసీపీకి మద్దతుగా మాట్లాడే అవకాశం లేదు. వైసీపీ విధానాలను సమర్థించే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలన్నింటికీ ఢిల్లీలో ఏ మార్గం ద్వారా ఆమోద ముద్ర వేయించుకుంటున్నారో.. ఆ మార్గాలు వైసీపీకి మూసుకుపోయాయనే భావన వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల కిందట.. సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడం ద్వారా వైసీపీకి హుషారొచ్చినా.. ప్రస్తుత జాతీయ కార్యవర్గంతో మాత్రం.. ఆ పార్టీకి నీరసం వచ్చినట్లయింది.